బెల్ట్ షాపులు ఇంకా నడుస్తున్నాయా..? ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు కావడం లేదా..?

ఆడియో లీక్ తో అసలు విషయాలు వెలుగులోకి…

దిశ దశ, హైదరాబాద్:

మందు బాబుల చెంతకే మద్యం అన్న రీతిలో ఏర్పడిన బెల్ట్ షాపులను ఎత్తి వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో విచ్చలవిడిగా ఏర్పడి బెల్టు షాపులు నిభందనలకు విరుద్దంగా నడుస్తున్నాయని వాటిని తొలగించాల్సిందేనని సీఎం ఆదేశించారు. దీంతో గ్రామాల్లో కిరాణ దుకాణాలను మరిపించే విధంగా ఏర్పడిన బెల్టు షాపులను తొలగించేందుకు ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో గ్రామాల్లో బెల్టు షాపులు కనుమరుగు అయిపోయాయని ప్రతి ఒక్కరూ భావించారు. లైసెన్స్ డ్ బార్లను మరిపించే విధంగా ఏర్పాటు చేసిన ఈ బెల్టు షాపుల భరతం పడుతున్నారని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.

బార్ ప్రతినిధి వర్సెస్…

జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రాంతంలో ఓ ఎక్సైజ్ అధికారి, బార్ అండ్ రెస్టారెంట్ ప్రతినిధితో జరిగిన సంభాషణ బెల్టు షాపులు నడుస్తున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓ బెల్టుషాపుకు ఎక్సైజ్ అధికారి హెచ్చరికలు జారీ చేసిన తరువాత జరిగిన ఈ సంభాషణ ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. తాము లిక్కర్ పంపించే బెల్ట్ షాపును ఎలా మూయిస్తారంటూ జరిగిన ఈ సంభాషణతో అసలు గుట్టు రట్టయినట్టయింది. దీంతో లిక్కర్ మాఫియా కానీ ఎక్సైజ్ అధికారులు కానీ బెల్ట్ షాపులను ఎత్తి వేసే ఆలోచనలో లేరన్న విషయం స్ఫస్టం అవుతోంది.

బార్ అండ్ రెస్టారెంట్లూ…

దర్జాగా సిట్టింగ్ ఏర్పాటు చేసుకుని ఇష్టారీతిన వినియోగదారుల వద్ద బిల్లులు వసూలు చేసుకోవచ్చన్న స్వేచ్ఛను అప్పటి ప్రభుత్వం బార్ అండ్ రెస్టారెంట్లకు కల్పించింది. బార్లలో కేవలం లిక్కర్ కాకుండా ఫుడ్ విక్రయాలు కూడా చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. ధరల విషయంలో కూడా నియంత్రణ లేకపోవడంతో మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ధరలకు వీరు లిక్కర్ విక్రయిస్తుంటారన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఇప్పటి వరకు వైన్ షాపుల వారే బెల్ట్ షాపులకు లిక్కర్ సరఫరా చేస్తారని, అక్కడి నుండే పల్లెల్లోని బెల్టు షాపులకు మద్యం తరలి వెల్తుంటుందన్నది జగమెరిగిన సత్యం. కానీ మెట్ పల్లికి సంబంధించిన ఆడియోలో బార్ అండ్ రెస్టారెంట్ల నుండి కూడా బెల్ట్ షాపులకు లిక్కర్ తరలిపోతుందన్న విషయం తేటతెల్లం అయింది. వైన్ షాపుల్లో లిక్కర్ లూజ్ సేల్స్ చేసేందుకు నిభంధనలు అనుమతించవు కానీ బార్ అండ్ రెస్టారెంట్లలో పెగ్ సిస్టంలో మద్యం అమ్మకాలు జరుపుకునే వీలు ఉంటుంది. చాలా వెసులు బాట్లు ఉన్నప్పటికీ బార్ అండ్ రెస్టారెంట్ల నుండి కూడా బెల్ట్ షాపులకు లిక్కర్ తరలి వెల్తుండడం మాత్రం విచిత్రమనే చెప్పాలి.

మామూళ్ల మత్తు కమ్ముకుందా..?

వైరల్ అవుతున్న ఈ ఆడియోలను నిశితంగా గమనిస్తే బెల్టు షాపుల వ్యవహారంలో ‘‘తిలా పాపం తలా పిడికెడు’’ అన్నట్టుగానే ఉందని స్ఫష్టం అవుతోంది. ఎక్సైజ్ విభాగానికి చెందిన పై అధికారుల పేరు పదే పదే సదరు అధికారి చెప్తుండడం గమనార్హం. బెల్టు షాపుల ద్వారా వచ్చే నెలవారి కవర్లు చేతికి అందకపోవడంతోనే బెల్టుషాపులపై దాడులు చేస్తున్నారన్న విషయం స్ఫష్టం అవుతోంది. బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా ఏర్పాటు చేసిన బెల్టు షాపుల నుండి రావల్సినవి రాకపోవడం వల్లే అధికారులు మూయించాలని చెప్పడంతో తాను క్లోజ్ చేయమని చెప్పడం జరిగిందన్న రీతిలో సదరు అధికారి స్పష్టంగా వివరించడం గమనార్హం. ఈ లెక్కన బెల్టు షాపులను ముఖ్యమంత్రి మూసివేయాలని ఆదేశించినా అవి మాత్రం నడవడం మాత్రం ఖాయమన్నది తేటతెల్లం అవుతోంది. దశాబ్దాల కాలంగా వేళ్లూనుకున్న బెల్టు మాఫియా, లైసెన్స్ పొందిన లిక్కర్ మాఫియా చేతులు కలిపి దందాకు ఎక్సైజ్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం ఈ ఆడియో ద్వారా స్పష్టంగా అర్థం అవుతోంది. బెల్టుషాపుల దందాపై లీకైన ఆడియో తరువాత అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.

You cannot copy content of this page