దిశ దశ. హైదరాబాద్:
హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ శివ బాల కృష్ణ అక్రమ ఆస్తుల కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ ఆయనను ఇప్పటికే అరెస్ట్ చేసిన తరువాత దర్యాప్తును మరింత లోతుగా చేపట్టారు. ఈ కేసులో ఆయనను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించి రూ. వందల కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు. అంతేకాకుండా బినామీల పేరిట కూడా ఆస్తులు ఉన్నట్టుగా విచారణలో తేల్చిన అధికారులు వారిపై దృష్టి సారించారు. ఆ తరువాత ఆయన తమ్ముడు శివ నవీన్ ను అరెస్ట్ చేయగా తాజాగా మంగళవారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న గోదావర్తి సత్యనారాయణ మూర్తి, పెంట భరత్ కుమార్, పెంట భరణి కుమార్ లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు.