దిశ దశ, హైదరాబాద్:
అత్యున్నతమైన సేవలందించడంలో భారతదేశ పోలీసు వ్యవస్థకే ఆదర్శంగా నిలిచింది రాజేంద్రనగర్ ఠాణా. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంహెచ్ఏ చేపట్టిన అధ్యయనంలో అన్నింటా ముందు వరసలో నిలిచి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జైపూర్ లో నిర్వహించిన డీజీపీల కాన్ఫరెన్స్ లో ఈ అవార్డను రాజేంద్రనగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బి నాగేంద్రబాబుకు హోం మంత్రి అమిత్ షా అందజేశారు.
పరిగణనలోకి తీసుకునే అంశాలివే…
అత్యున్నతమైన సేవలందించే స్టేషన్లకు గుర్తింపునివ్వాలన్న సంకల్పంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన వాటిల్లో ఉత్తమ సేవలందించిన స్టేషన్లకు ఈ అవార్డును అందజేస్తోంది. ఇందులో మహిళల భద్రత విషయంలో ప్రత్యేక చొరవ చూపించడం, భార్య, భర్తల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కౌన్సెలింగ్ నిర్వహించడం, మిస్సింగ్ కేసులను ట్రేస్ చేయడం, శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల ఛేదన, ఠాణాలకు వచ్చిన వారితో మర్యాద పూర్వకంగా మాట్లాడడం అంశాల్లో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ టాప్ వరసలో నిలిచింది. అంతేకాకుండా ఈ స్టేషన్ పరిధిలో చనిపోయిన వారి పూర్తి వివరాలు తెలుసుకుని వారి బంధువులకు మృతదేహాలు అప్పగించడంలోనూ ప్రత్యేక చొరవ చూపించారు.
17 వేల ఠాణాల్లో…
దేశంలోని 29 రాష్ట్రాలలో మొత్తం 17 వేలకు పైగా ఉన్న పోలీస్ స్టేషన్ల నుండి 74 ఠాణాలను ఈ అవార్డుల జాబితాలో చేర్చారు. ఇందులో తొలి మూడు పోలీస్ స్టేషన్ల పనితీరును ప్రామాణికం చేసుకుని అవార్డులకు ఎంపిక చేశారు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో జమ్ము కశ్మీర్ లోని షేర్ ఘరీ, పశ్చిమ బెంగాల్ లోని సెరంపూర్ స్టేషన్ మూడో స్థానంలో నిలిచింది. రాజేంద్రనగర్ ఎస్ హెచ్ ఓ నాగేంద్ర బాబుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.