9 ఏళ్ల నాటి ప్రత్యర్థులు అసెంబ్లీ బరిలోకి…
ఎంపీగా నాడు… ఎమ్మెల్యేగా నేడు…
చెన్నూరు వేదికగా రసవత్తర పోరు…
దిశ దశ, చెన్నూరు:
సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. అప్పుడు ఎంపీగా పోటీ చేసిన ఆ ఇద్దరు ఇప్పుడ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు రంగంలోకి దిగారు. ఎన్నెన్నో మలుపులు చోటు చేసుకున్న తరువాత మళ్లీ వారిద్దరు పోటీ పడుతుండడంతో ఆ నియోజకవర్గంపై అందరి దృష్టి పడుతోంది.
2014 ఎన్నికల్లో…
స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తొలిసారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో వివేక్, బాల్క సుమన్ లు పోటీ పడ్డారు. అప్పుడు చెమట చక్కకు, సెంటు వాసనకు మధ్య పోటీ జరుగుతోందని, వందల కేసులకు, వందల కోట్లకు మద్య వార్ సాగుతోందంటూ అప్పుడు బాల్క సుమన్ కామెంట్ చేసేవారు. ఈ నినాదాన్ని పెద్ద ఎత్తున వినిపించిన బాల్క సుమన్ పెద్దపల్లి ఓటర్లను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. తొలి ఎన్నికల్లోనే బాల్క సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపికగా కూడా మారిపోయాయి. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని పెద్దపల్లి నుండి ఓ సారి ఎంపీ కూడా అయిన వివేక్ మళ్లీ గెలుపును అందుకోలేకపోయారు. 2014 లోకసభ ఎన్నికలప్పటి నుండి కూడా ఓటమి వైపే ఆయన ప్రయాణం సాగుతోందన్నట్టుగా మారిపోయింది. అయితే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న వివేక్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో తలపడుతున్నారు.
ప్రతికారం తీర్చుకుంటారా..?
అయితే 9 ఏళ్ల క్రితం బాల్క సుమన్ ఓడించడమే కాకుండా 2019 లోకసభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ టికెట్ రాకుండా అడ్డుకున్న వారిలో ఆయన పాత్ర ఉందని వివేక్ వర్గం చెప్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాల్క సుమన్ ప్రత్యర్థిగా నిలబడ్డ వెంకటేష్ నేతను అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చి వివేక్ కు టికెట్ రాకుండా మంత్రాంగం నెరపడంలో బాల్క సుమన్ హస్తం ఉందని కూడా అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఓడించడమే కాకుండా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలువకుండా అడ్డుకున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రశేఖర్ పేరును అధిష్టానం ఖరారు చేయడం, ఆయన చకాచకా నామినేషన్ దాఖలు చేయడంతో వివేక్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో అప్పటి ఎన్నికలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో బీజేపీలో చేరిన వివేక్ ఇటీవలే సొంత గూటికి చేరుకుని చెన్నూరు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. అయితే రాజకీయంగా బాల్క సుమన్ ఎత్తుల్లో చిక్కుకపోయిన వివేక్ మళ్లీ ఆయనపైనే పోటీ చేస్తున్నారు. దీంతో పొలిటికల్ లైఫ్ లో ఇబ్బందులు కల్గించిన బాల్క సుమన్ పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వివేక్ కు వచ్చిందటూ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే వివేక్ ఇక్కడి నుండి టికెట్ ఆశించిన నల్లాల ఓదెలును తనకు అనుకూలంగా మల్చుకోగా, జిల్లాలోనూ తనకు అనుకూలమైన వాతావరణం నెలకొనేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. తన అన్న వినోద్ కు, మంచిర్యాల అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావుకు మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను సద్దుమణిగేలా చేశారు. దీనివల్ల చెన్నూరులోని ప్రేమ్ సాగర్ రావు వర్గం కూడా వివేక్ కు సానుకూలంగా ఉంటారని వివేక్ అంచనా వేస్తున్నారు.
వ్యూహాలు ఎలా ఉంటాయో…
వివేక్ ను ఓడించేందుకు బాల్క సుమన్ ఎలాంటి ఎత్తులు వేస్తారు… ప్రతికారాం తీర్చుకునేందుకు వివేక్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారోనన్న చర్చ సాగుతోంది. బలమైన ప్రత్యర్థుల మధ్య సాగే పోరు ఉత్కంఠతను రేకెత్తించే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.