శాంతి చర్చలపై ‘‘భారత్ బచావో’’ సంస్థ సరికొత్త ప్రతిపాదన

చత్తీస్ గడ్ ప్రభుత్వానికి లేఖ…

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్ ప్రభుత్వం, మావోయిస్టు పార్టీ శాంతి చర్చలపై మరో సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు పౌర హక్కుల సంఘాల నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నేతలు బస్తర్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు మావోయిస్టు పార్టీ ముందుకు వచ్చిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హననాన్ని నిలువరించాల్సిన ఆవశ్యకత ఉందంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇటీవలే మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం కూడా శాంతి చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు బేస్ క్యాంపుల ఏర్పాటును నిలిపివేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చత్తీస్ గడ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న విజయ్ శర్మ కూడా షరతులతో కూడిన చర్చలకు తాము సిద్దమేనని ప్రకటించారు. అయినప్పటికీ మావోయిస్టు ఏరివేత ప్రక్రియ విషయంలో బలగాలు దూకుడుగానే ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల ఎదురు కాల్పులు జరగడంతో పాటు మావోయిస్టు పార్టీ షెల్టర్ జోన్లను బలగాలు చుట్టు ముడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చత్తీస్ గడ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రి గుట్టలను బలగాలు చుట్టు ముట్టడంతో పాటు పలువురు నక్సల్స్ ఎన్ కౌంటర్ లో మరణించినట్టుగా తెలుస్తోంది. ఐదు రోజులుగా కర్రి గుట్టల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పౌరహక్కుల సంఘాల ప్రతినిధులు శాంతి చర్చలు జరపాలని కోరగా, మావోయిస్టు పార్టీ నేత రూపేష్ అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవ రావు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు.

తాజాగా మరో సంస్థ…

తాజాగా భారత్ బచావో సంస్థ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ చత్తీస్ గడ్ ముఖ్యమంత్రికి ఓ లేఖ కూడా రాసింది. భారత్ బచావో వైస్ ఛైర్మన్ ఎంఎఫ్ గోపీనాథ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గాదె ఇన్నయ్య, నేషనల్ కౌన్సిల్ బాధ్యులు జంజర్ల రమేష్ బాబుల పేరిట విడుదల అయిన ఈ లేఖ వెలుగులోకి వచ్చింది. చత్తీస్ గడ్ సీఎంకు రాసిన ఈ లేఖలో మావోయిస్టులు, ప్రభుత్వ ప్రతినిధులు శాంతి చర్చల గురించి ఇప్పటి వరకు తెలియజేసిన అభిప్రాయాలను కూడా వివరించారు. 2022లో ఏర్పాటయిన భారత్ బచావో అనే సౌర సమాజ సంస్థ ప్రతినిధులు అపారమైన ప్రాణ నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్య భారతంలో జరుగుతున్న రక్త పాతాన్ని ఆపేందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవల్సిన అవసరం ఉందని, అక్కడ నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించడానికి తమవంతు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. చ2024 నంుడి ఇప్పటి వరకు 400 మందికిపైగా ఆదివాసీలు, మావోయిస్టులు చనిపోయారని, మిలటరైజేషన్ గణనీయంగా పెరిగిందని, ఒక్క బస్తర్ డివిజన్ లోనే 300లకు పైగా క్యాంపులు ఏర్పాటు చేశారని ఆ లేఖలో వివరించారు. నిరాయుధులైన ఆదివాసీలు, చిన్నారులు, మహిళలు, అమాయక పౌరులు బాధితులుగా మారిపోతున్నారని నివేదికలు సూచిస్తున్నాయన్నారు. శాంతి యుతంగా నిరసనలు తెలిపే సంస్థలపై ఉపా కింద నిషేధం విధించడం, కోసులు నమోదు చేయడం, అరెస్టులు చేస్తుండడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. భయాందోనకరంగా మారిన ఈ పరిస్థితిలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలనే ఉద్ధేశ్యంతో తమ సంస్థ చొరవ తీసుకుంటున్నదని భారత్ బచావో ప్రతినిధులు వెల్లడించారు. శాంతి చర్చల ప్రక్రియను కొనసాగించేందుకు తమ సంస్థ ఎంపిక చేసిన సంధానకర్తల బృందాన్ని మావోయిస్టుల వద్దకు వెల్లేందుకు అవసరమైన పరిస్థితులు కల్పించాలని కోరారు. ఇందు కోసం మావోయిస్టు పార్టీ నాయకులతో చర్చలు జరిపేందుకు భగత్ సింగ్ మేనల్లుడు జగ్మోహన్ సింగ్, 2004లో ఏపీ ప్రభుత్వంతో శాంతి చర్చల సమయంలో సంధానకర్తగా వ్యవహరించిన ప్రొఫెసర్ హరగోపాల్, చత్తీస్ గడ్ లో కిడ్నాప్ సంక్షోభ సమయంలో ప్రభుత్వం తరుపున సంధానకర్తగా వ్యవహరించిన అలెక్స్ పాల్ మీనన్, రాజకీయ శాస్త్రవేత్త మనోరంజన్ మోహంతిలను అభ్యర్థించి శాంతి చర్చల అంశం గురించి చొరవ తీసుకునే విధంగా ప్రయత్నిస్తామన్నారు. భారత్ బచావో చేసిన ఈ ప్రతిపాదనపై చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి స్పందన కోసం ఎదురు చూస్తుంటామని కూడా ఆ లేఖలో వెల్లడించారు.

You cannot copy content of this page