ఇప్పటికే రెండు టీమ్స్ పట్టివేత
మల్టీ టాస్క్ ఆపరేషన్ లో ఆ జిల్లా పోలీసులు
దిశ దశ, భూపాలపల్లి:
ఒకప్పటి మావోయిస్టు పార్టీ కంచుకోటలో పోలీసులు మల్టీ టాస్క్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. గెరిల్లా యుద్దం వైపు సాగిన నక్సల్స్ ప్రయాణానికి బ్రేకులు వేసి దశాబ్దం దాటిపోయినా పొరుగు రాష్ట్రాల కారణంగా నిత్యం కూంబింగ్ ఆపరేషన్లలో నిమగ్నం అవుతున్న ఆ జిల్లా పోలీసులు ఇప్పుడు నకిలీ నక్సల్స్ కోసం కూడా వేట కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో రెండు నకిలీ నక్సల్స్ ముఠాలను పట్టుకోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
రెండు రాష్ట్రాల బార్డర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైవిద్యమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఓ వైపున మహారాష్ట్ర, మరో వైపున చత్తీస్ గడ్ రాష్ట్రాలు ఉండడంతో ఇక్కడి పోలీసు యంత్రాంగం గోదావరి పరివాహక ప్రాంతాల్లో డేగ కళ్లతో నిఘా వేస్తున్నారు. చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతం, మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతాల నుండి మావోయిస్టులు రాష్ట్రంలోకి రాకుండా నిలువరించేందుకు పోలీసులు నిరంతరం కూంబింగ్ ఆపరేషన్లలోనే నిమగ్నం కావల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని సార్లు జిల్లాలోని మహదేవపూర్, పల్మెల మండలాల మీదుగా మావోయిస్టులు రాష్ట్రంలోకి వచ్చే ప్రయత్నాలు చేశారని నిఘా వర్గాలు నివేదిక ఇవ్వడంతో పోలీసులు హై అలెర్ట్ గా ఉంటున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన స్థానికులు కొందరు నక్సల్స్ అవతారం ఎత్తి వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో భూపాలపల్లి జిల్లా పోలీసులు అటు మావోయిస్టుల ఎంట్రీకి బ్రేకులు వేస్తూ… ఇటు నకిలీ నక్సల్స్ ను ఏరి పారేయడంపై దృష్టి సారించాల్సి వస్తోంది.
ఇప్పటికి రెండు టీమ్స్
నక్సల్స్ పేరిట చందాలు వసూలు చేయాలన్న లక్ష్యంతా ఏర్పడుతున్న ముఠాల కార్యకలాపాలకు ఇక్కడి పోలీసులు ఆదిలోనే చెక్ పెడుతున్నారు. కాటారం సబ్ డివిజన్ పోలీసులు నకిలీలపై స్పెషల్ నజర్ వేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు నకిలీ నక్సల్స్ ముఠాలకు చెందిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ లో కాళేశ్వరం సర్పంచ్ భర్త మోహన్ రెడ్డితో పాటు మరోకరికి వార్నింగ్ లెటర్స్ పంపి పార్టీ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాటారం పోలీసులు స్పెషల్ టాస్క్ వేసి నకిలీలను కట్టడి చేయడంలో సఫలం కాగా… తాజాగా మరో నలుగురు నకిలీ నక్సల్స్ ను కూడా అరెస్ట్ చేయడం గమనార్హం. నిందితులు మావోయిస్టుల పేరిట వసూళ్లకు పాల్పడి సొమ్ము గడించాలన్న లక్ష్యంతోనే నకిలీల వేషం కట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఆర్జీ మేయర్ కూ…
గతంలో అరెస్టయిన ముఠా భూపాలపల్లి జిల్లాకు చెందిన వారికే హెచ్చరికల లేఖలు రాసి పార్టీ ఫండ్ అడగగా, శుక్రవారం అరెస్ట్ అయిన ముఠా మరో అడుగు ముందుకేసి రామగుండం మేయర్ బంగి అనిల్ కు కూడా హెచ్చిరకలు చేస్తూ లేఖలు రాయడం గమనార్హం. వారం రోజుల క్రితం పోస్ట్ మెన్ ద్వారా వచ్చిన ఈ లేఖను మేయర్ అనిల్ పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చి సీక్రసీ మెయింటెన్ చేశారు. రామగుండం కమిషనరేట్ పోలీసులు అనిల్ కు వచ్చిన లేఖపై ఆరా తీస్తున్న క్రమంలో భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు పట్టుకున్న నకిలీ నక్సల్ ముఠానే లేఖ పంపిందని తేలింది.