జడ్పీ ఛైర్ పర్సన్ భర్త పీఏ నంటూ ఫోన్లు..!

ఎస్సీ కార్పోరేషన్ రుణాలపై కమిషన్ల వసూళ్లు…

నెట్టింట వైరల్ అవుతున్న ఆడియో…

దిశ దశ, భూపాలపల్లి:

ఎస్సీ కార్పోరేషన్ లోన్ మంజూరైదంటూ భూపాలపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ భర్త పీఏ పేరిట చేసిన ఫోన్ కాల్స్ ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్సీ కార్పోరేషన్ అధికారులకు పర్సంటేజీలు ఇవ్వాల్సి ఉంటుదంటూ సదరు వ్యక్తి మాట్లాడిన ఈ ఆడియో నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.

పీఏ: తొగరి రాజశేఖర్ మీరేనా..?

బెనిఫిషర్: లేదండి నా పేరు రాజేందర్

పీఏ: మీరు ఎస్సీ కార్పోరేషన్ లోను కోసం అప్లై చేశారా..?

బెనిఫిషర్: చేశాం సార్ కానీ నా పేరు రాజేందర్

పీఏ: మీకు ఎస్సీ కార్పోరేషన్ లోన్ కనఫం అయింది, 2 డేస్ లో మనకి లెటర్స్ వస్తాయి. అన్నయ్య వాళ్లతో మాట్లాడారు, అయితే వాళ్లు పర్సంటేజీ అడుగుతున్నారు. లక్షకి 12 వేల చొప్పున పర్సంటేజీ కావాలంటున్నారు. అన్నయ్య వాళ్లు పేదవాళ్లు అని మాట్లాడారు. వాళ్లంటున్నారు… ఎంత దగ్గరి వాళ్లు అయినా నేనివ్వకపోయినా నా కింది వాళ్లకు ఇవ్వాలని. దీంతో 12 శాతం నుండి 10 శాతానికి తగ్గించి మాట్లాడారు అన్నయ్య. మనకు త్రి డేస్ లో లెటర్స్ వస్తాయి, లోన్ కనఫం అయినట్టు, ఎంత మనకి 2 లక్షలకు కదా…? జోక్యం చేసుకున్న బెనిఫిషర్ కాదండి 5 లక్షలండి అనగానే మనకు ఒక 5 లక్షలు అంటే 10 శాతం పర్సెంటేజీకి రూ. 50 వేలు అవుతుంది కానీ మీ కోసం అన్నయ్య 10 వేలు తగ్గించి రూ. 40 వేలకు మాట్లాడాడు. లెటర్స్ వచ్చే వరకే మనీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు, అన్నయ్య చాలా బాగా వాదించారు, నిన్ననే మీకు కాల్ చేయాల్సింది కానీ చేయలేకపోయాను… మీది స్పెషల్ తీసుకున్నారు అన్నయ్య అంటూ వివరించారు. బ్యాంకర్లకు ఇచ్చేప్పుడు ఫేక్ సర్టిఫికెట్లు లేకుండా చూసుకోండి… అన్నయ్య కూడా బ్యాంకర్లతో మాట్లాడుతాడు. రెండు రోజుల్లో మీ అమౌంట్ రెఢీ చేసుకోండి అని పీఏ అన్నారు.

యూనిట్ వివరాలే తెలియని పీఏ

భూపాలపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ భర్త జక్కు రాకేష్ పీఏనంటు కాలే చేసిన వ్యక్తి మాట్లాడిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఆడియోలో ఉన్న మాటలను బట్టి అసలు లబ్దిదారుని పేరే అతనికి తెలియకపోవడంతో పాటు బెనిఫిషర్ ఏ యూనిట్ కు దరఖాస్తు చేసుకున్నాడు..? యూనిట్ కాస్ట్ ఎంత అన్న వివరాలు కూడా తెలియకుండా మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. జక్కు రాకేష్ ఫోన్ ఎస్సీ కార్పోరేషన్ అధికారులతో మాట్లాడినట్టయితే లబ్దిదారునికి సంబంధించిన వివరాలు తెలియకుండా ఎలా మాట్లాడుతారోనన్నదే పజిల్ గా మారింది. అంతేకాకుండా అధికారపార్టీకి చెందిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ భర్తతో ఎస్సీ కార్పోరేషన్ అధికారులు పర్సంటేజ్ డీల్ మాట్లాడే అవకాశం ఉందా అన్నది తేలాల్సి ఉంది. ఒక వేళ రాకేష్ కు సంబంధించని వ్యక్తి పీఏగా పేరు చెప్పి డీల్స్ మాట్లాడినట్టయితే అంత ధైర్యం చేసే అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. రాజకీయాల్లో ఉన్న నాయకుడు ఇలా పర్సంటేజీల గురించి డీల్ మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతామని, అధిష్టానం ముందు అబాసుపాలవుతామని సదరు నాయకుడు ఆలోచించే అవకాశం ఉంటుంది కదా..? ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కమిషన్ల గురించి పీఏ ద్వారా ఎలా మాట్లాడిస్తాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. పీఏ మాట్లాడుతున్న తీరును గమనిస్తే బెనిఫిషర్ యూనిట్ కాస్ట్, డిటైల్స్ కూడా తెలియకుండానే పర్సంటేజీ మాట్లాడే ఆదుర్దలో కాల్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది. రాజేందర్ లేదా రాకేష్ కు రుణం మంజూరు గురించి ప్రత్యేకంగా మాట్లాడినట్టయితే దరఖాస్తు దారుని గురించి, అతను ఏ యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలు లేకుండా పీఏ మాట్లాడడం విచిత్రం.

ఆయన ఎవరు..?

నెట్టింట వైరల్ అవుతున్న ఆడియోలో అంశాలు అన్ని నిజమైనట్టయితే అధికారులతో అనధికారిక వ్యక్తి ఎలా మాట్లాడుతారు..? లబ్దిదారులకు యూనిట్లు మంజూరు చేయడంలో ఆయన ప్రమేయాన్ని అధికార యంత్రాంగం ఎలా సమ్మతిస్తుందోనన్నది అంతు చిక్కడం లేదు. జడ్పీ ఛైర్ పర్సన్ హోదాలో జక్కు శ్రీ హర్షిణి లబ్దిదారులకు యూనిట్లు మంజూరు చేసే విషయంపై సమీక్ష చేయడం కానీ అధికారులను అడగడం చేసినట్టయితే నిబంధనలు వర్తిస్తాయి కానీ… ఆమె భర్త రాకేష్ ఎలా జోక్యం చేసుకున్నారోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. జక్కు రాకేష్, శ్రీ హర్షిణీ దంపతులు ఇద్దరూ కూడా విద్యావంతులే అయినందున అధికారికంగా జరగాల్సిన వ్యవహారంలో రాకేష్ ఎలా జోక్యం చేసుకుంటున్నారోనన్నది అంతుచిక్కకుండా పోతోంది. ఇప్పటికే సతుల స్థానంలో పతులు అధికారాలను వెలగబెడుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏకంగా జడ్పీ ఛైర్ పర్సన్ భర్త ఎస్సీ కార్పోరేషన్ అధికారులతో యూనిట్ల మంజూరు గురించి రాయబేరాలు మాట్లాడిన ఆడియో పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. అనధికారిక వ్యక్తి పీఏ ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో తలదూర్చడం ఏంటన్నది కూడా మిస్టరీగా మారింది.

సీఎం ప్రకటనా బేఖాతర్..?

ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు స్కీంలో అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇందులో పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని ఆ ఎమ్మెల్యేలు పద్దతి మార్చుకోవాలని కూడా కుండబద్దలు కొట్టారు. దళిత బంధు లబ్దిదారులకు రూ.10 లక్షల సాయం అందించే విషయంలో రూ. 3 లక్షల వరకూ చేతులు మారుతున్నాయని సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం హెచ్చరికలు జారీ చేసి నెల రోజులు తిరగక ముందే భూపాలపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ భర్త పీఏ పేరిట పర్సంటేజీల డీల్ మాట్లాడుతున్న ఆడియో లీక్ కావడం సంచలనంగా మారింది.

పాత ఆడియో: బీఆర్ఎస్

జక్కు రాకేష్ పీఏ పేరిట వైరల్ అవుతున్న ఆడియో 2019లో జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు కావాలనే ప్రత్యర్థులు వైరల్ చేస్తున్నారని, లేనిపోని దుష్ప్రచారాలు చేసేందుకేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2021 నుండి రాకేష్ కు పీఏలే లేరని చెప్తున్నారు.

You cannot copy content of this page