ప్రసన్న హరికృష్ణకు మద్దతుపై బీఆర్ఎస్ క్లారిటీ…
దిశ దశ, వేములవాడ:
మహా శివరాత్రి పర్వదినాన వేములవాడ రాజన్న సన్నిధిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చే విషయంలో స్పష్టత ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నిన్నటి వరకు నర్మగర్భంగా బీఆర్ఎస్ నాయకులు తమ మద్దతు గురించి వెల్లడించగా బుధవారం ఈ విషయంపై ఆ పార్టీ ముఖ్య నేత తమ మద్దతు ఎవరికో తేల్చి చెప్పేశారు.
ఎమ్మెల్సీ కవితతో…
మహా శివరాత్రి పర్వదినాన వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సతీమణి ప్రసన్న ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో తన జీవిత భాగస్వామి హరికృష్ణకు మద్దతు ఇవ్వాలని కవితను అభ్యర్థించగా ఇందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బీసీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటించగా, బుధవారం నాడు వేములవాడలో చోటు చేసుకున్న పరిణామంతో హరికృష్ణకు అండగా నిలుస్తామని మాట ఇవ్వడంతో బహిరంగంగానే బీఆర్ఎస్ శ్రేణులు క్యాంపెయిన్ నిర్వహించనున్నాయి. బీసీ నినాదంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన కవిత బీసీ అభ్యర్థికి బాసటగా నిలవడమే మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
సింగ్ కు షాక్…
అయితే తాజాగా కల్వకుంట్ల కవిత తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిందనే చెప్పాలి. ఇటీవల కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించినప్పుడు బీఆర్ఎస్ నాయకుడు రవిందర్ సింగ్ ఎమ్మెల్సీ కవితను కలిశారు. ప్రసన్న హరికృష్ణను పార్టీలో చేర్పించుకునే విషయం గురించి చర్చించారు. అనంతరం పెద్దపల్లిలో కొంతమందితో రవిందర్ సింగ్ కు అనుకూలంగా వ్యవహరించాలన్న సంకేతాలు కవిత ఇచ్చారన్న ప్రచారం జరిగింది. వాస్తవంగా ప్రసన్న హరికృష్ణ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ నాయకుడిని వెంటబెట్టుకున్న ఆయన గజ్వేల్ ఫామ్ హౌజ్ లో అధినేత కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించాలని కూడా ఆయన ఆ పార్టీ ముఖ్య నాయకులతో సమీకరణాలు నెరిపారు. అయితే పార్టీలో చేరిన వెంటనే హరికృష్ణకు టికెట్ ఇవ్వడం సముచితం కాదని, పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టేది లేదని అధినేత కేసీఆర్ తేటతెల్లం చేశారు. ప్రసన్న హరికృష్ణ చివరి క్షణం వరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సర్దార్ రవిందర్ సింగ్ తనకు లాభిస్తుందని ఆశించి భంగపడినట్టే అయింది. రవిందర్ సింగ్ బీఆర్ఎస్ పార్టీ కలర్ గులాభి రంగులో ప్రచార సామాగ్రిని తయారు చేసి కార్యరంగంలోకి దూకారు. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ వర్గాలను మింగుడుపడకుండా చేసింది. ఈ విషయంపై ఆయా జిల్లాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కవితలతో పాటు ఇతర ముఖ్య నాయకులతో కూడా మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత బీసీ కార్డు నినాదం అందుకుని ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గాల అభ్యర్థులకు మద్దతు ఇస్తే బావుంటుందన్న ప్రతిపాదనలు కూడా ముఖ్య నాయకత్వం ముందు ఉంచారు. స్థానిక సంస్థల ఎమ్మోల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి మరీ బరిలో నిలిచారని, ఆ తరువాత కూడా రవిందర్ సింగ్ కు సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారన్న విషయాన్ని కూడా కొంతమంది నాయకులు గుర్తు చేసినట్టు సమాచారం. పార్టీ నిర్ణయాన్ని కాదని సింగ్ పోటీ చేస్తున్న తీరుపై కూడా పలు ఫిర్యాదులు చేసినట్టుగా సమాచారం. పోలింగ్ తేదీ వరకూ ఆచూతూచి అడుగులు వేసిన బీఆర్ఎస్ పార్టీ గత నాలుగైదు రోజులుగా తన స్వరాన్ని మార్చడం మొదలు పెట్టింది. బీసీ అభ్యర్థికే తమ మద్దతిస్తామన్న కామెంట్ చేస్తూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. చివరకు మహా శివరాత్రి పర్వదినాన పార్టీ ముఖ్య నాయకత్వం తమ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్టయింది. దీంతో ప్రసన్న హరికృష్ణకు పార్టీ శ్రేణులు బహిరంగంగా మద్దతు ఇవ్వనుంది.
లాభిస్తుందా..?
అయితే ఇంతకాలం మౌనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు హరికృష్ణకు అనుకూలంగా మారడం ఆయనకు ఎంతవరకు లాభిస్తుందోనన్న విషయంపై చర్చలు సాగుతున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసన తరువాత తమ అభిప్రాయాన్ని ప్రకటించినట్టయితే తమ వాదనలను బలంగా వినిపించే అవకాశం ఉండేదని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. చివరి సమయంలో మద్దతు ఇస్తుండడం వల్ల పూర్తి స్థాయిలో హరికృష్ణకు శ్రేణులు పనిచేసే అవకాశం ఉండదని అంటున్న వారూ లేకపోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించామని అధిష్టానం మొదట ప్రకటించిన తరువాత పార్టీ క్యాడర్ తమకు అనుకూలమైన వారికి అండగా ఉంటామని మాట ఇచ్చారు. ఎవరి ప్రాధాన్యతలను బట్టి వారు తమకు నచ్చిన అభ్యర్థులకు అనుకూలంగా మద్దతు ఇస్తున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు హరికృష్ణకు మద్దతు ఇచ్చినట్టయితే తాము అతనికే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఎలా అడగగలుగుతామని అంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం హరికృష్ణకు మద్దతు ఇచ్చే విషయంలో క్లారిటీ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రసన్న హరికృష్ణకు పూర్తి స్థాయిలో అండగా నిలబడే అవకాశం ఉంటుందా లేదా అన్నదే అసలు చర్చ.