తనదేనంటున్న మహేష్
దిశ దశ, కరీనంగర్:
నాలుగు రోజుల క్రితం ఆర్టీసీ గూటికి చేరిన కోడి విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మరి కొన్ని గంటల్లో వేలం వేసేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అయిన క్రమంలో ఆ కోడి తనదేనంటూ నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్ చెప్తున్నారు. నెల్లురు జిల్లా ఇసుకాడమేర్లకు చెందిన తాను కొంతకాలంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మేస్త్రీ పని చేసుకుంటు గత కొంతకాలంగా జీవనం సాగసిస్తున్నాని మహేష్ వివరించారు. అయితే గత సోమవారం రాత్రి వేములవాడ నుండి నెల్లూరుకు వెల్లేందుకు వేములవాడలో ఆర్టీసీ బస్సు ఎక్కానని, కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో టిఫిన్ చేశారని మహేష్ వివరించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో వరంగల్ లో తాను నిద్ర మత్తులో బస్సు దిగి నెల్లూరు చేరుకున్నానని తెలిపారు. అయితే తన కోడిని ఎక్కడో మర్చిపోయానని ఆవేదనతో ఉన్న సమయంలో వివిధ మీడియా ఛానెల్లలో రావడంతో ఆ కోడి తనదేనని గుర్తించి ఆర్టీసీ అధికారులను సంప్రదించాడు. తాను బస్సులో మర్చిపోయిన కోడి బ్యాగు అదే బస్సులో వేములవాడకు తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో కరీంనగర్ లో కండక్టర్ గుర్తించి కంట్రోలర్ కు అప్పగించి ఉంటాడని అన్నారు.
అది పందెం కోడి కాదు: మహేష్
అయితే తాను ఆర్టీసీ బస్సులో మర్చిపోయిన కోడీని తనకు భీమవరంకు చెందిన రాజు అనే బిల్లర్ ఆరు నెలల క్రితం ఇచ్చారని దానిని రుద్రంగికి తీసుకొచ్చి పెంచుకుంటున్నానని వివరించారు. అయితే అది పందెం కోడి కాదని బ్రీడింగ్ కోసం తీసుకొచ్చుకున్నానని, నెల్లూరు వెల్తుండడంతో దానిని తనవెంట తీసుకెళ్తున్నానని మహేష్ వివరించారు. ఆర్టీసీ అధికారులకు అది తన కోడేనని చెప్పానని ఇందుకు సంబంధించిన పోటోలు, వీడియోలు కూడా తన వద్ద ఉన్నాయని వివరించినట్టుగా చెప్పారు. అయితే ఈ కోడిని వేలం వేసేందుకు నిర్ణయించామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారని నెల్లూరులో ఉన్న తాను ఆర్టీసీ అధికారులను వచ్చి కలుస్తానని తన కోడిని అమ్మకానికి పెట్టవద్దని అభ్యర్థిస్తున్నారు. తాను బస్సులో ప్రయాణించిన టికెట్ ను కూడా ఆయన షేర్ చేశారు.
ఐదు గంటల్లో వేలం…
మరో ఐదు గంటల్లో కోడిని వేలం వేసేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్న క్రమంలో నెల్లూరు నుండి మహేష్ ఆ కోడి తనదేనని చెప్తుండడంతో అధికారులు ఏంచేస్తారోనన్న ఉత్కంఠత నెలకొంది. మహేష్ కోసం వేలాన్ని రద్దు చేస్తారా లేక వేలం వేసి అమ్మకం చేస్తారా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.