ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ కుంభకోణంలో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు బయటపడింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ చేర్చింది. కవిత ప్రతినిధిగా అరుణ్‌పిళ్లై వ్యవహరించారని ఈడీ స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్ లో మాగుంట శ్రీనివాసులు, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.
ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో రాఘవ లిక్కర్ కార్యకలాపాలు చేస్తున్నారని, ఎంపీ మాగుంట శ్రీనివాసులు ద్వారా భాగస్వామ్యం పొందారని రిమాండ్ రిపోర్టులో ఈడీ ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ కార్యకలాపాలన్నీ రాఘవ నిర్వహించేవారని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా మాగుంట రాఘవ కలిశారని తెలిపింది. రూ.100 కోట్లు లంచం ఇఛ్చిన సౌత్ గ్రూప్ లో రాఘవ కీలకమని, కవిత కూడా ఈ గ్రూపులో ఉన్నారని ఈడీ స్పష్టం చేసింది.
ఇటీవల ఈ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో కూడా కవిత పేరును ప్రస్తావించింది. ఇప్పుడు మరోసారి కవిత లింకులు ఈ స్కాంలో బయటపడటం బీఆర్ఎస్ వర్గాలను టెన్షన్ పెట్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో కవితను గతంలో సీబీఐ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. కవితను కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తోన్నాయి.
లిక్కర్ స్కాం కేసులో ఇటీవల సీబీఐ, ఈడీ మరింత దూకుడు పెంచాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేస్తోన్నాయి. గత కొద్దిరోజుల్లోనే ఏకంగా ముగ్గురిని సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసింది. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయనను రిమాండ్ లోకి అధికారులు తీసుకున్నారు. వరుసగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని సీబీఐ, ఈడీ అరెస్ట్ చేస్తోంది. దీంతో కవిత విషయంల ఏం జరుగుతుందనేది టెన్షన్ రేపుతోంది.