మహదేవపూర్ అవిశ్వాస రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

కాంగ్రెస్ క్యాంపునకు చేరిన మరో ఎంపీటీసీ…

మ్యాజిక్ ఫిగర్ పై మొదలైన మ్యూజిక్…

దిశ దశ, మహదేవపూర్:

ఒకే ఒక్క ఓటు అవిశ్వాస రాజకీయాలను కీలక మలుపు తిప్పనుంది. సిట్టింగ్ ఎంపీపీ పదవి పోవడం ఖాయమని అనుకుంటున్న తరుణంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో బుధవారం జరగనున్న అవిశ్వాస సమావేశంలో ఏం జరగనుందో అన్నదే హాట్ టాపిక్ గా మారింది.

అధికార పార్టీలోనే ముసలం…

అధికా పార్టీలోనే నెలకొన్న ముసలం కాస్తా అవిశ్వాసం వరకు చేరడంతో మహదేపూర్ ఎంపీపీ రాణీబాయిని గద్దె దించేవిధంగా ఆమె వైరి వర్గం పావులు కదిపింది. అవిశ్వాసం లేఖపై సంతకాలు చేసి అధికారులకు ఇచ్చిన అనంతరం క్యాంపు రాజకీయాలను నెరిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వద్దకు చేరగా మరో ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీ క్యాంపులో చేరారు. దీంతో శ్రీధర్ బాబు కనుసన్నల్లోనే ఈ అవిశ్వాస రాజకీయాలు నడుస్తున్నాయన్న ప్రచారం కూడా విస్తృతంగా సాగింది. అనూహ్యంగా కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యురాలు తిరిగి స్వగ్రామానికి చేరుకోవడం, ఆగస్టు 2న విశ్వాస పరీక్షకు సంబంధించిన సమావేశం జరగనుండడంతో రాణిబాయి ప్రత్యర్థి వర్గం తమ గెలుపు ఖాయమన్న ధీమాతో ఉంది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలిని రాత్రికి రాత్రే శ్రీధర్ బాబు ఏర్పాటు చేసిన క్యాంపునకు తరలించడంతో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మరో రెండు రోజుల్లో అవిశ్వాస సమావేశం జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీని కూడా కాంగ్రెస్ నాయకులు షిప్ట్ చేయడంతో విశ్వాసం నెగ్గడమా వీగడమా అన్న ఉత్కంఠత మొదలైంది. మండలంలో 9 ఎంపీటీసీ స్థానాల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ఆరు చోట్ల, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మూడు చోట్ల నెగ్గారు. ఎంపీపీ రాణీబాయికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టడంతో ఆమె అసమ్మతి వర్గానికి ఉన్న బలం ఐదు మాత్రమే, వీరికి మరొక్కరు తోడైతే అవిశ్వాసం నెగ్గుతుంది. లేనట్టయితే వీగి పోయి రాణీబాయే ఎంపీపీగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యురాలి మద్దతు కూడగట్టుకున్నప్పటికీ ఆదివారం రాత్రి చోటు చేసుకున్న అనూహ్య పరిణామలు ఎటువైపు దారి తీస్తాయోనన్న చర్చ సాగుతోంది.

శ్రీధర్ బాబు కోర్టులో…

మహదేవపూర్ అవిశ్వాస రాజకీయాల్లో అధికార పార్టీకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీదే కీలక భూమికగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ముగ్గురు సభ్యులు కూడా ఇప్పుడు శ్రీధర్ బాబు క్యాంపులో చేరడంతో ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విప్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పటి వరకు పార్టీకి దూరంగా ఉన్న ఎంపీటీసీ కూడా కాంగ్రెస్ క్యాంపునకు తరలడం సరికొత్త మలుపు తిప్పినట్టయింది. విశ్వాసానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులతో ఓటు వేయించినా, వ్యతిరేకంగా ఓటు వేయించినా లాభం మాత్రం అధికార పార్టీకే అయినందున ఆయన ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగబోతున్నారన్న చర్చ సాగుతోంది. దీంతో ఆయన నిర్ణయమే ఫైనల్ కావడంతో బుధవారం నాటి విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ పార్టీ ఎటు మొగ్గు చూపుతుందోనన్న అంశంపై మండలంలో తర్జనభర్జనలు సాగుతున్నాయి.

నిన్న మొన్నటి వరకు…

అయితే మండలంలో అవిశ్వాస రాజకీయాలు నెరుపుతున్న ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవి, సిట్టింగ్ ఎంపీపీ రాణీబాయి ఇద్దరు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం గమానార్హం. ఎన్నికలకు ముందు రాణీబాయి గులాభి జెండా కప్పుకోగా ఎన్నికల తరువాత రమాదేవి హస్తాన్ని వీడారు. ఇద్దరు నాయకురాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్నటి వారకు ఉన్న వారే కావడంతో వీరిద్దరిలో ఎవరికి శ్రీధర్ బాబు ఆశీస్సులు అందిస్తారోనన్నదే తేలాల్సి ఉంది.

You cannot copy content of this page