దిశ దశ, హుజురాబాద్:
హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రీ డిజైన్ వ్యవహారం కాస్తా ఫిర్యాదుల వరకు చేరింది. వాస్తు దోషం ఉందన్న కారణంగానే సింహ ద్వారం కూల్చివేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కూల్చుతున్నారని మాజీ సర్పంచులు మహేందర్ గౌడ్, కరుణాకర్ లు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. కూల్చివేతలను నిలిపివేసి ఘటనపై విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్టు కింద చర్యలు తీసుకోవాలని కూడా వారు అభ్యర్థించారు.
ఎమ్మెల్యే ఫిర్యాదు..?
మరో వైపున క్యాంపు కార్యాలయం విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. స్థానిక ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఆయన క్యాంపు ఆఫీసు మరమ్మత్తులు చేస్తుండగా కొంతమంది వచ్చి అడ్డుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొనట్టుగా సమాచారం. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరినట్టుగా తెలుస్తోంది. ముగ్గురిపై చేసిన ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకోవల్సి ఉన్నట్టుగా సమాచారం.
పోలీసులకు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆర్డీఓకు ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకున్నట్టయింది. ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న ఉత్కంఠత నెలకొంది. అయితే మహేందర్ గౌడ్, కరుణాకర్ లు ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కూల్చివేతలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజీ యాక్టు కింద చర్యలు చేపట్టాలనిి కోరారు. దీంతో ఎమ్మెల్యేపై రెవెన్యూ అధికారులు కానీ, ఆర్ అండ్ బి అధికారులు కాని ప్రత్యేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం కొంతమందిపై నేరుగా పోలీసులకే ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. కౌశిక్ రెడ్డి ఫిర్యాదులో క్యాంపు ఆఫీసు రీ డిజైన్ చేస్తున్నట్టుగా లిఖిత పూర్వకంగా ఒప్పుకున్నట్టే అయిందన్న వాదనలు కాంగ్రెస్ నాయకులు తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో సంబంధిత శాఖల అధికారులకు తెలియకుండా మరమ్మత్తులు చేయడం చట్ట విరుద్దమేనని అంటున్నారు. దీంతో హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయం కేంద్రీకృతంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండడం గమనార్హం. అయితే అధికారులు ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుతారన్న చర్చ కూడా సాగుతోంది.