అనుకులంగా ఐదుగురున్నారు: ‘పుట్ట’ వర్గం
క్యాంపులో పది మంది ఉన్నారు: అసమ్మతి వర్గం
దిశ దశ, పెద్దపల్లి:
జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పుట్ట మధును గద్దె దింపేందుకు అసమ్మతీయులంతా జట్టు కట్టిన నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం ఎత్తులు ఫలించకుండా జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు కూడా వ్యూహాలు రచిస్తున్నారు. అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో పెద్దపల్లిలో సానుకూల వాతావరణం తీసుకొచ్చే బాధ్యతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అప్పగించింది. దీంతో ఆయన కూడా ఎంటర్ అయి సమీకరణాలు నెరపడం మొదలు పెట్టారు.
ఐధుగురు మాతోనే: ‘పుట్ట’ వర్గం
జిల్లాలో మొత్తం 13 మంది జడ్పీటీసీలు ఉండగా పుట్ట మధుకు అనుకూలంగా ఐదుగురు ఉన్నారని ఆయన వర్గం చెప్తోంది. అవిశ్వాసం నెగ్గాలంటే 9 మంది సభ్యుల కోరం అవసరం ఉంటుందని అయితే ఐదుగురు పుట్ట మధుతోనే ఉండడంతో అసమ్మతి వర్గంలో 8 మందే ఉంటారని దీంతో అవిశ్వాసం వీగిపోవడం ఖాయమని పుట్ట మధు వర్గీయులు వాధిస్తున్నారు. వీరే కాకుండా మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా రంగంలోకి దిగడంతో సమీకరణాలు అన్ని మారిపోయాయని కూడా అంటున్నారు. తమకు పార్టీ పేరు చెప్పి తప్పుదోవ పట్టించారని క్యాంపులో ఉన్న జడ్పీటీసీలు ఆరోపిస్తున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. క్యాంపులో ఉన్న ముగ్గురు జడ్పీటీసీలు తాము బయటకు వస్తున్నామని కూడా హామీ ఇచ్చారని కూడా చెప్తున్నారు. దీంతో పుట్ట మధుపై పెట్టిన అవిశ్వాసం వీగిపోవడం ఖాయమని కూడా తేల్చి చెప్తున్నారు. గురువారం మాజీ మంత్రి కొప్పుల ఇంటి వద్ద జరిగిన సమీకరణాలకు పుట్ట మధుకు అనుకూలంగా ఓదెల, ధర్మారం, మంథని, అంతర్గాం జడ్పీటీసీ సభ్యులు గంట రాములు, పూస్కురి పద్మజ జితేందర్ రావు, తగరం సుమలత శంకర్ లాల్, ఆముల నారాయణలు హాజరయ్యారన్నారు. పుట్ట మధుతో కలుపుకుంటే మొత్తం ఐదుగురు జడ్పీటీసీ సభ్యులు తమతో ఉన్నారని అవిశ్వాసం పెట్టాలంటే కోరం సభ్యుల సంఖ్య 9 ఉండాలన్న విషయాన్ని పుట్ట మధు వర్గీయులు అంటున్నారు. ఈ లెక్కన అసమ్మతి వర్గం ఏర్పాటు చేసిన క్యాంపులో 8 మందే ఉన్నందున ఖచ్చితంగా అవిశ్వాసం వీగిపోతుందని స్ఫష్టం చేస్తున్నారు.
10 మంది మాకు అనుకూలం: అసమ్మతి వర్గం
అయితే పుట్ట మధు వ్యతిరేక వర్గం కూడా ఈ విషయంలో బలమైన వాదనలు వినిపిస్తోంది. తమ క్యాంపులో 10 మంది ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. మాజీ మంత్రి కొప్పుల సమావేశానికి హాజరైన వారిలో ఒకరిద్దరు జడ్పీటీసీలు కూడా అంతర్గతంగా అవిశ్వాసానికే అనుకూలంగా ఉన్నామని చెప్పారని అసమ్మతి నాయకులు చెప్తున్నారు. కోరం ఖచ్చితంగా తమకు అనుకూలంగా సంతకాలు చేస్తుందని, అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్ కు లేఖలు కూడా ఇస్తామని వారు బలంగా వాదిస్తున్నారు. అయితే అటు జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు క్యాంపు, ఇటు అసమ్మతి క్యాంపుల్లో ఎవరికి వారే ధీమాతో ఉండడం గమనార్హం. అయితే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంట్లో భేటీ అయిన జడ్పీటీసీ సభ్యులకు సంబంధించిన వివరాలను కూడా పుట్ట మధు వర్గం బహిరంగంగా వెల్లడించడంతో ట్విస్ట్ చోటు చేసుకున్నట్టయింది.
మ్యాజిక్ నెంబర్ ‘1’
అయితే పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ అవిశ్వాస వ్యవహారంలో అత్యంత కీలకంగా నంబర్ 1 అత్యంత కీలకంగా మారింది. అసమ్మతి వర్గంలో 10 మంది ఖచ్చితంగా ఉన్నట్టయితే పుట్ట మధు గద్దె దిగడం ఖాయం. కానీ పుట్ట మధు తనతో పాటు మరో నలుగురు సభ్యులు తనకే అనుకూలంగా ఉన్నందున కోరం ఉండదని దీంతో అసమ్మతి వర్గం చేస్తున్న ప్రయత్నాలు పక్కాగా విఫలం అవుతాయంటున్నారు. అయితే అసమ్మతి వర్గంలో 8 మంది మాత్రమే ఉంటే మాత్రం మరో జడ్పీటీసీ బలం అవసరం ఉండగా ఈ ఒక్కరిని అసమ్మతి వర్గానికి చిక్కుకుండా చూసుకోవల్సిన ఆవశ్యకత పుట్ట మధుపై పడింది. ఏది ఏమైనా పెద్దపల్లి జడ్పీలో నెలకొన్న అవిశ్వాస రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయోనన్నదే హాట్ టాపిక్ గాబ మారింది.