రాదు రాదంటూనే వచ్చెనే…

పెద్దపల్లి అభ్యర్థి ఎంపికలో ట్విస్టులే ట్విస్టులు…

దుగ్యాల ప్రదీప్ కు అవకాశం…

దిశ దశ, పెద్దపల్లి:

రాష్ట్రంలో అధికారమే పరమావధిగా పావులు కదుపుతున్న కమలం పార్టీ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం నత్తలకే నడుపుతోంది. నామినేషన్ల చివరి రోజు వరకూ టికెట్ల కెటాయింపు ప్రక్రియను కొనసాగించిన బీజీపీ పెద్దలు శుక్రవారం చిట్ట చివరి జాబితాను విడుదల చేశారు. కార్య క్షేత్రంలో ప్రచారం చేసిన వారికి కూడా టికెట్లు కెటాయించే విషయంలో మీనామేషాలు లెక్కించిన బీజేపీ నాయకత్వం ఓ తంతునయితే ముగించింది.

పెద్దపల్లిలో ఎన్నెన్నో మలుపులు

పెద్దపల్లి నుండి ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించిన నాయకులకు కమలనాథులు చుక్కలు చూపించారు. టికెట్ వస్తుందన్న ఆశతో కొందరు చివరి క్షణం వరకు ప్రయత్నించి చేతులెత్తేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుండి దుగ్యాల ప్రదీప్ రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి, గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, కొలిపాక శ్రీనివాస్ లతో పాటు మరికొంతమంది ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరారు. టికెట్ ఆశించిన అభ్యర్థులంతా కూడా పెద్దపల్లిలో తమవంతుగా ప్రచారం చేసుకున్నారు. అయితే మొదట ఇక్కడి నుండి దుగ్యాల ప్రదీప్ రావు, గొట్టి ముక్కుల సురేష్ రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. ఆ తరువాత ప్రదీప్ రావు పార్టీ సేవకే పరిమితం అవుతున్నారని ప్రచారం జరిగింది. దీంతో సురేష్ రెడ్డి పేరు దాదాపు ఖాయం అనుకున్నారంతా. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తరువాత మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రెండు మూడు రోజుల క్రితం మళ్లీ గొట్టిముక్కుల సురేష్ రెడ్డి పేరు ప్రతిపాదనలు తెరపైకి రాగా ఆయన తిరస్కరించినట్టుగా సమాచారం. దీంతో బీజేపీ అధిష్టానం దుగ్యాల ప్రదీప్ కుమార్ పేరునే ఫైనల్ చేసింది. మొదట దుగ్యాల ప్రదీప్ రావు పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆ తరువాత ఆయన పేరు తెరమరుగు కాగా చివరగా జాబితాలో ఆయన పేరే ఖరారు కావడం విశేషం.

You cannot copy content of this page