రాజకీయ శరణార్థిగా గుర్తించండి: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దరఖాస్తు…

అమెరికాలో కీలక పరిణామం…

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్…

దిశ దశ, హైదరాబాద్:

తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆ పిటిషన్ లో పేర్కొన్న ఆయన ఇక్కడ తాను కీలక స్థానంలో పనిచేశానని కూడా వివరించారు. తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడిన తాను ప్రస్తుతం చికిత్స చేయించుకుంటున్నానని, ఫ్లోరిడాలోని తన కొడుకు వద్ద ఉంటున్నాని ప్రభాకర్ రావు పేర్కొన్నారు.

వ్యూహంలో భాగమేనా..?

ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత విదేశాలకు వెల్లిన ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి వచ్చేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. అమెరికాలో చికిత్స చేయించుకునేందుకు ముందుగానే దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించిన ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం స్వస్థలానికి వచ్చే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్తున్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రాగానే ప్రభాకర్ రావు చుట్టే ఈ అంశం తిరుగుతూ వస్తోంది. ఆయనను ప్రభుత్వం తెలంగాణాకు ఎలా రప్పిస్తుందోనన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. ఈ క్రమంలో ఇంటర్ పోల్ సహాయంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పోలీసు విభాగం లేఖ రాసింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో అమెరికా ప్రభుత్వం ఆయనకు గ్రీన్ కార్డ్ కెటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు అవుతారా లేదా అన్న అంశమే చర్చనీయాంశం అవుతోంది. మొదట గ్రీన్ కార్డ్ పొందిన ప్రభాకర్ రావు అమెరికా చట్టాలను అనుసరించి తనకు షెల్టర్ ఇవ్వాలని, భారతదేశానికి అప్పగించవద్దని పరోక్షంగా అభ్యర్థించినట్టయింది. అక్కడి పౌరసత్వం పొందిన తరువాత తనకు అమెరికా చట్టాలే వర్తిస్తాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్టుగా స్పష్టం అవుతోంది. గ్రీన్ కార్డు రాకముందు ఆయన భారతీయ పౌరుడిగా ఉన్నందున అక్కడి ప్రభుత్వం ఇక్కడి చట్టాలకు అనుగుణంగా నడుచుకోవల్సి వచ్చేది. అప్పటికే ఇంటర్ పోల్ ద్వారా రప్పించేందుకు ఉత్తర ప్రత్యుత్తారలు చేసినట్టయితే ఆయనను అమెరికా అప్పగించే అవకాశం ఉండేదని తెలుస్తోంది. అయితే తెలంగాణ పోలీసులు ప్రభాకర్ రావును ఇంటర్ పోల్ సహాయంతో ఇండియాకు రప్పించాలని కోరుతూ లేఖ రాసిన క్రమంలోనే ఆయనకు అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అభ్యర్థించడంతో అమెరికా చట్టాలు ఆయనకు అనుకూలంగా ఉండే అవకాశాలే మెండుగా ఉంటాయని తెలుస్తోంది. ఉగ్రవాదులు, దేశ విద్రోహ శక్తుల విషయంలో మాత్రం దౌత్య సంబంధాలలో భాగంగా అప్పగించే సంస్కృతి ఉంటుంది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కోణం కూడా ఉందన్న వాదనలు అక్కడి ప్రభుత్వానికి వినిపించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభాకర్ రావు వాదనలను అక్కడి ప్రభుత్వం అంగీకరించినట్టయితే అక్కడి కోర్టుల్లోనే విచారణ జరిపించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావును తెలంగాణ పోలీసులు ఎలా తీసుకవస్తారన్నదే పజిల్ గా మారిపోయింది.

రాజకీయ శరణార్థేనా..?

అయితే పోలీసు విభాగంలో వివిధ బాధ్యతల్లో పని చేసిన ప్రభాకర్ రావు ఐపీఎస్ స్థాయికి చేరుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటలీజెన్స్ బ్రాంచ్ (SIB) చీఫ్ గా, ఇంటలీజెన్స్ చీఫ్ గా కూడా పనిచేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో అధికా పార్టీ మారడం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరపడం, కొంతమంది అధికారులను అరెస్ట్ చేయడం చకాచకా జరిగిపోయింది. ఈ కేసులో కీలక పాత్రధారి ప్రభాకర్ రావేనన్న అభిప్రాయానికి దర్యాప్తు అధికారులు వచ్చారు. ఆయన వస్తే కానీ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదన్నది వాస్తవం. కేసు నమోదు నాటికే అమెరికా వెల్లిన ప్రభాకర్ రావు తాజాగా వేస్తున్న ఎత్తులు మాత్రం అంతు చిక్కకుండా పోతున్నాయి. గ్రీన్ కార్డు ద్వారా అమెరికా సిటిజన్ షిప్ అందుకున్న ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అభ్యర్థించిన తీరు సంచలనంగా మారింది. అయితే ఆయన తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అభ్యర్థించిన తీరుపై కూడా చర్చ సాగుతోంది. సివిల్ సర్విసెస్ అధికారిగా ప్రమోట్ అయి పలు బాధ్యతల్లో పని చేసిన ఆయనను కావాలనే తెలంగాణ ప్రభుత్వం హింసిస్తోందా..? రాజకీయాలతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాల్సిన ఉన్నతాధికారి రాజకీయ శరణార్థి ఎలా అవుతారోనన్నదే అంతు చిక్కకుండాపోతోంది. పాకిస్తాన్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అక్కడ రాజకీయంగా పదవుల్లో ఉన్న నాయకులను వ్యతిరేకించిన నేపథ్యంలో వారంతా కూడా ఇతర దేశాలకు వెల్లి రాజకీయ శరణార్థులుగా ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా రాజకీయ శరణార్థిగా ఉన్నారు. కానీ ఓ ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి రాజకీయ శరణార్థి అవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఇందుకు అమెరికా ప్రభుత్వం సమ్మతించినట్టయితే సివిల్ సర్విసెస్ అధికారిని రాజకీయ శరణార్థిగా గుర్తించిన అత్యంత అరుదైన చరిత్ర క్రియేట్ చేసినట్టు అవుతుంది.

అదే నిజమైతే..?

తనను రాజకీయ కోణంలోనే వేధింపులకు గురి చేస్తున్నందున శరణార్థిగా గుర్తించాలన్న వాదనలు ప్రభాకర్ రావు వినిపిస్తున్నట్టుగా అర్థం అవుతోంది. దీనివల్ల తాను తెలంగాణ పోలీసుల నుండి విచారణ ఎదుర్కొనే అవకాశం ఉండదన్న నమ్మకంతో వ్యూహాలకు పదును పెడుతున్న ఆయన సక్సెస్ అవుతారా లేదా అన్న విషయం అటుంచితే… ఆయనపై జరుగుతున్న ప్రచారం అంతా కూడా నిజమేనని పరోక్షంగా ఒప్పుకున్నట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. ఉన్నతాధికారిగా నిబంధనల మేరకు నడుచుకోకుండా తన పరిధికి మించిన సాహసం చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనతో పాటు మరికొంత మంది సబార్డినేట్లను కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములను చేయడంతో వారిప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు. అయితే ఆయన పిటిషన్ తెరపైకి తీసుకొస్తున్న బిగ్ ట్విస్ట్ ఏంటంటే… అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేశామని చెప్పకనే చెప్పినట్టయింది. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చే ఆదేశాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే తిరస్కరించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుంది. కానీ వారి ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు తుంగలో తొక్కేరీతిలో వ్యవహరించడం సరైంది కాదన్నది వాస్తవం. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు కూడా ప్రభాకర్ రావు ఓ పోలీసు అధికారితో మాట్లాడుతూ… ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకున్నానని, ఫోన్ ట్యాపింగ్ చేయడమనేది సహజమే కదా అన్న రీతిలో వ్యాఖ్యానించారని ప్రచారం జరిగింది. అయితే దేశ భద్రతకు భంగం వాటిల్లే విషయంలో, అరాచకాలకు పాల్పడే దేశ విద్రోహుల విషయంలో ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతుంటాయి. వారి స్కెచ్ లను గుర్తించి ఎక్కడికక్కడ నియంత్రించి దేశ భద్రతకు భంగం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటాయి. కానీ ప్రతిపక్ష, అధికార పార్టీలకు సంబంధించిన కదలికలు తెలుసుకునేందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆదేశించినా అధికారులు మాత్రం ఇందుకు సమ్మతించే అవకాశాలు ఉండవని ఆయా వర్గాలు చెప్తున్న మాట. అయితే ఇక్కడ ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అభ్యర్థించారంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశానని పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా అని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కానీ తెలంగాణాలో కానీ ఆయనపై ఉన్న ఏకైక అభియోగం ఫోన్ ట్యాంపింగ్ కేసే కాబట్టి ఈ విషయంలో ఆయన తప్పటడుగులు వేశారని భావించే అవకాశాలు కూడా లేకపోలేదు. 

You cannot copy content of this page