తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజగా ఏపీ సీఎం జగన్ తో ఆయన భేటీ కావడం కీలకంగా మారింది.
ఇటీవల లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మతో పొంగులేటి భేటీ అయ్యారు. దీంతో ఆయన షర్మిల ఆధ్వర్యంలోని వైఎస్సార్‌టీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. షర్మిల పాదయాత్ర ముగింపు సభ త్వరలో పాలేరులో జరగనుంది. ఈ సభలో షర్మిల సమక్షంలో పొంగులేటి వైఎస్సార్ టీపీ కండువా కప్పుకుంటారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో జగన్ ను పొంగులేటి కలవడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి పొంగులేటి.. గంటపాటు చర్చలు జరిపారు.
ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ టార్గెట్ గా విమర్శనస్త్రాలు సంధించారు. త్వరలోనే బీఆర్ఎస్ కు పొంగులేటి గుడ్ బై చెప్పే అవకాశముంది. కానీ ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానాలు వచ్చాయి. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలతో కూడా గతంలో భేటీ అయ్యారు. దీంతో దాదాపు అన్ని పార్టీల నుంచి పొంగులేటికి ఆహ్వానాలు వస్తున్నాయి. పొంగులేటి బీజేపీలో చేరతారనే ప్రచారం గతంలో జరిగింది.
త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పొంగులేటి భేటీ అవుతారని, కాషాయ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఏమైందో ఏమో కానీ బీజేపీలో చేరికకు బ్రేక్ పడింది. బీజేపీలో చేరేందుకు ఆయన ఆసక్తిగా లేరని, అందుకే ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ ను కలవడంతో.. పొంగులేటి త్వరలోనే ఏదోక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని అంటున్నారు. తనకు రాజకీయ జన్మను ఇచ్చిందని జగన్ అని పొంగులేటి పలుమార్లు చెప్పారు.