పలిమెల భూముల్లో బిగ్ ట్విస్ట్…
దిశ దశ, పలిమెల:
పలిమెల భూముల వ్యవహారంలో కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. దశాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని వదిలి వెల్లిపోయిన భూస్వాములు సాదా బైనామాల ద్వారా క్రయ విక్రయాలు జరిపారని, వంశ పారపర్యంగా కూడా పట్టాదారులుగా వస్తున్నారని పాసు బక్కుల్లో రికార్డులు నమోదు చేశారు రెవెన్యూ అధికారులు.
ఇలా కూడా…
1980వ దశాబ్దంలో పలిమెల ప్రాంతాన్ని వీడిన పాషా దొర కుటుంబానికి సంబంధించిన భూ లావాదేవీలు ఎవరు జరిపారన్నదే అసలు ట్విస్ట్ గా మారింది. ఇంతకాలం ఈ భూములను రిజిస్ట్రేషన్ ద్వారా విక్రయించారన్న ప్రచారం జరిగినప్పటికీ కొన్ని పాసు పుస్తకాల్లో మాత్రం సాదా బైనామాలు, వారసులు అంటూ పేర్కొన్న తీరే విస్మయానికి గురి చేస్తోంది. రిజిస్ట్రేషన్ చేసిన కమాలోద్దీన్ అనే వ్యక్తి ద్వారా చేయించుకున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపిస్తున్నారు. అసలు పట్టాదారులతో సంబంధం లేని వ్యక్తుల ద్వారా యాజమాన్య హక్కుదారులను మార్చేశారన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ధరణీ పాసు పుస్తకాలను పరిశీలిస్తే మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొంతమంది సాదా బైనామా ద్వారా భూముల యాజమాన్యులుగా మారిపోయారని, మరికొంతమంది అనువంశీయ హక్కుదారులుగా వచ్చారని రెవెన్యూ అధికారులు వివరించారు.
సాధ్యమేనా..?
40 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని వదిలేసిన భూ స్వాములు సాదాబైనామాల ద్వారా భూములు విక్రయించినట్టయితే ఆ తరం వారికి భూములు విక్రయించే అవకాశం ఉంటుంది కానీ, ఈ జనరేషన్ కు చెందిన వారికి భూములు ఎలా విక్రయిస్తారన్నదే పజిల్ గా మారింది. సాదా బైనామాల ద్వారా నిజంగానే పాషా దొర కానీ పట్టాదారులు కానీ విక్రయించినట్టయితే ఆయన ఎప్పుడు మరణించారోనన్న విషయంపై స్పష్టత వస్తే అసలు విషయం తెలియనుంది. ఒక వేళ పాషా దొర కానీ పట్టాదారులు కానీ సాదాబైనామా ద్వారా భూములు అమ్మినట్టయితే ఇంతకాలం ఎందుకు రికార్డుల్లో నమోదు కాకపోవడానికి కారణం ఏంటీ..? అసలు ఆ సాదా బైనామాలు ఎవరు రాసిచ్చారు..? ఒక వేళ పట్టాదారుల వారసులు రాసిచ్చినట్టయితే ఆ భూములు వారి పేరిట రెవెన్యూ రికార్డుల్లో మారాయా లేదా, అప్పుడు అసలు పట్టాదారుకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్, కుటుంబ సభ్యుల దృవీకరణ పత్రాలను రెవెన్యూ అధికారులకు సబ్మిట్ చేశారా లేదా అన్న విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక వేళ సాదాబైనామాలు ఇప్పుడు పట్టాదారులగా ఉన్న వ్యక్తులు రెవెన్యూ అధికారులకు అప్పగించినట్టయితే వారికి రాసిచ్చింది ఎవరు అన్నది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. పట్టాదారులు స్థానికంగా ఉండడం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే అయినందున వారి వారసులకు సంబంధించిన వివరాలు నిజామా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవల్సిన అవసరం రెవెన్యూ అధికారులపై ఉంది.
వంశీయులా..?
పలిమెల భూములన్ని కూడా ముస్లింల పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. హక్కుదారులుగా వారసులు రెవెన్యూ రికార్డుల్లోకి వచ్చినట్టయితే వారికి సంబంధించిన పేర్లు రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ హిందువులు అనువంశీయులుగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు రికార్డుల్లో పేర్కొనడం విచిత్రంగా ఉంది. ఒక వేళ ప్రస్తుత పట్టాదారులకు వారి పూర్వీకుల నుండి ఈ భూములు సంక్రమించినట్టయితే వారు ఎప్పుడు, ఎవరి వద్ద ఈ భూములు కొన్నారన్న విషయంపై కూడా స్పష్టత రావల్సిన అవసరం ఉంది. ఇంతకాలం వీరు ఈ భూముల వైపు కన్నెత్తి చూడకుండా ఇప్పుడు వాటిని విక్రయించేందుకు సమాయత్తం కావడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది. భూ మాఫియా కోరలు చాచడం వల్లే ఈ భూముల రికార్డులు మారి పోయాయా..? లేక నిజంగానే భూములను పట్టాదారులు విక్రయించారా అన్న విషయంపై క్లారిటీగా విచారణ చేయాల్సిన ఆవశ్యకత జిల్లా అధికార యంత్రాంగంపై ఉంది.
ఆ సర్వే ఏమైంది..?
పలిమెల భూముల వ్యవహారం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఈ భూముల విషయంలో కబ్జాలో ఉన్నది స్థానిక దళిత గిరిజనులు కాగా రికార్డుల్లో మాత్రం స్థానికేతరుల పేర్లు నమోదయ్యాయి. తమకు అన్యాయం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో 2013లో రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా సర్వే జరిపినట్టుగా తెలుస్తోంది. ఆ సర్వే సమయంలో కబ్జాలో ఉన్న రైతుల వివరాలను కూడా సేకరించినట్టుగా సమాచారం, అయితే ఈ సర్వే ఆధారంగా రికార్డులు మార్చే విషయంలో ఎందుకు ఆలస్యం అయిందో కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉంది.