దిశ దశ, కరీంనగర్:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ట్రస్మా అండదండలపై దండిగా ఆశలు పెట్టుకున్న ఆ అభ్యర్థికి సొంతింటి నుండే పోటీ మొదలైంది. దీంతో ట్రస్మా మద్దతు ఎవరికి ఇవ్వబోతుందన్నదే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ట్రస్మా మద్దతు కోరుతూ లక్ష్ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా ఆర్గనైజింగ్ సెక్రటరీ ముస్తాక్ అలీఖాన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డిని కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ముస్తాక్ అలీ ఖాన్ వినతి పత్రం కూడా అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బరిలో శేఖర్ రావు…
అయితే ఇప్పటికే ట్రస్మా అండదండలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యాదగిరి శేఖర్ రావు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ట్రస్మా మద్దతు తనకే ఉందని ఆయన చెప్పుకుంటున్న క్రమంలో ముస్తాక్ అలీ ఖాన్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ట్రస్మా ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాసంస్థల తరుపున ఒక్కరే పోటీ చేస్తే అన్ని ఓట్లు కూడా ఒక్కరికే పడే అవకాశం ఉంటుంది. కానీ ఒకే సంఘం నుండి ఇద్దరు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతుండడం వల్ల అభ్యర్థుల తల రాతలు మారే అవకాశం లేకపోలేదు. ట్రస్మా వ్యవస్థపకుడిగా, చీఫ్ అడ్వయిజర్ గా ఉన్న యాదగిరి శేఖర్ రావుకు అనుకూలంగా ట్రస్మాలోని ముఖ్యులతో పాటు ఏపీ ప్రైవేటు స్కూల్ మేనేజ్ మెంట్ యూనియన్ ప్రతినిధులు కూడా అండగా ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో లక్ష్ స్కూల్స్ అధినేత కూడా మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నం కావడంతో ట్రస్మాలో సరికొత్త చర్చ మొదలైంది.
ఇరకాటంలో…
యూనియన్ లో కీలక బాధ్యతల్లో ఉన్న ఇద్దరు బరిలో నిలబడేందుకు ఉత్సుకత చూపిస్తుండడంతో ట్రస్మా ముఖ్య నాయకులు ఇరకాటంలో పడనున్నారు. తమ మద్దతు ఎవరికి ఇవ్వాలోనన్న విషయంపై తర్జనభర్జనలు కొనసాగనున్నాయి. దీంతో సంఘం సంపూర్ణ మద్దతు ఎవరికి లభిస్తుందోనన్న చర్చ ఇంటా బయట మొదలైంది. ఏది ఏమైనా ట్రస్మా అండదండలతో తమ విజయాన్ని సునాయసం చేసుకోవాలని ఆశిస్తున్న ఇద్దరు అభ్యర్థులు ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతోంది.