దిశ దశ, హైదరాబాద్:
వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఏ బంతిలో కూర్చున్నా ఫర్వాలేదు అన్న నానుడికి తగ్గట్టుగానే పని చేశారా..? అధికారం చెప్పు చేతల్లో కీలు బొమ్మలుగా మారి కాపాడాల్సిన వారే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారా..? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలను గమనిస్తే మాత్రం యూనిఫాం తలదించుకునేలా వ్యవహరించినట్టుగా స్పష్టమవుతోంది. కేసుల్లో అరెస్ట్ అయిన నిందితుల నుండి సేకరించిన కన్ఫెషన్ రిపోర్టుల్లో బయట పడుతున్న విషయాలు యావత్ పోలీసు విభాగాన్ని కలవరపెడుతున్నాయి. చిన్న తప్పు చేస్తేనే మెమోలు, ఛార్జి మెమోలు, ఓఈ(ఓరల్ ఎంక్వైరీ)లు చేస్తూ సత్యశోధన కోసం శీల పరీక్షలు, శల్య పరీక్షలు చేసే పోలీసు విభాగాన్ని ఈ స్థాయికి దిగజార్చారా అన్న ఆవేదన వ్యక్తమవుతోంది సామాన్యుల్లో.
బాల్య స్నేహితుని కోసం…
ఓ సినిమాలో సాయి కుమార్ చెప్పిన నాలుగో సింహం నేనేరా అన్న డైలాగ్ తో మీసం మెలేస్తూ ధైర్యాన్ని ప్రదర్శించే పోలీసులను చూశాం కానీ… ఆ నాలుగో సింహం నిద్ర లేస్తే అక్రమాలకు కూడా తెర తీయోచ్చన్న విషయం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణతో అర్థమవుతోంది. ఉన్నతాధికారులే అక్రమాలకు పాల్పడడడం ఏంటన్నదే ఇప్పుడు అన్ని వర్గాలను వెంటాడుతున్న ప్రశ్న. ఇలాంటి అక్రమాలకు శ్రీకారం చుట్టడం వల్లే కొంతమంది క్షేత్రస్థాయి అధికారులు ఇష్టారీతిన వ్యవహరించడానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా తన బాల్య స్నేహితుడి కోసం మాజీ డీసీసీ రాధా కిషన్ రావు పోలీసు వ్యవస్థను, పోలీసు వాహనాలను కూడా ఫణంగా పెట్టిన తీరు అన్ని వర్గాలను విస్మయపరుస్తోంది. డబ్బులను తరలించేందుకు ప్రత్యేకంగా ఐ ఫోన్లను సమకూర్చి మరి సబార్డినేట్లతో ఊడిగం చేయించుకున్నారంటే వీరికి ఎలాంటి స్వేఛ్ఛ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఉన్నాయో లేక ముఖ్యుల ఆశీస్సులు ఉన్నాయో తెలియదు కాని కంచే చేనును మేసిందన్న చందగా మారిపోయింది ఈ అధికారుల తీరు. రాధాకిషన్ రావు తన బాల్య స్నేహితుడు అయిన ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి ఇంటి నుండి డబ్బులు తరలించేందుకు ఓ ఎస్సైని వాడుకున్న తీరే విచిత్రంగా ఉంది. ఓ ఆసుపత్రితో పాటు ఇతర ప్రాంతాలకు నగదును రవాణా చేసేందుకు ఎస్సైని పావుగా వాడుకున్నారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో ప్రత్యేక నిఘా పెట్టేందుకు చొరవ చూపాలని భారత ఎన్నికల సంఘాన్ని ఎవరైన అభ్యర్థించినట్టయితే… రహస్య విచారణ జరిపించేందుకు ఈసీఐ కేంద్ర నిఘా వర్గాలను ఆదేశించినట్టయితే… ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి..? ఈసీఐ స్పెషల్ ఆపరేషన్ లో డబ్బులు రవాణా తతంగం గుట్టు రట్టయ్యేది. దీంతో వాటిని తరలించిన ఎస్సై నగదుతో పట్టుబడితే ఆయన జీవితం ఏమయ్యేది..? ఈ నగదును తరలించింది తామేనని ఈ పెద్దలు ఒప్పుకునే వారా..? రెడ్ హైండెడ్ గా పట్టుడిని ఆ ఎస్సైని బలి పశువును చేసి చేతులు దులుపుకునే వారు తప్ప తామే వ్యూహ కర్తలమంటూ ముందుకు వచ్చే వారా..? రాజీనామా చేసిన ఐఏఎస్ అధికారి ఇంటి కేంద్రంగా సాగించిన నగదు రవాణా గుట్టు అంతటితోనే ముగిసిపోయేది. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పై సునిశిత పరిశీలన సాగుతుండడంతో ఈ వాస్తవాలన్ని వెలుగులోకి వస్తున్నాయి.
ఇంత స్వేచ్ఛ ఎలా..?
గాడ్ ఈజ్ యూనివర్సల్ పోలీస్ అనే ఇంగ్లీష్ సామెత ఉంది. అంటే తప్పు చేసిన వారిని శిక్షించేందుకు విశ్వమంతటిని పోలీసుల్లా పరిశీలించేందుకు దేవుడు చూస్తున్నాడని ఈ సామెత ద్వార హెచ్చరించే వారు. అంటే చివరకు దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని చెప్పేందుకు కూడా పోలీసులతో పోల్చారంటే వారి పనితీరు ఎలా ఉంటుంది, తప్పు చేసిన వారిని చట్టానికి పట్టించే విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అన్న విషయాన్ని ఈ నానుడి చెప్పకనే చెప్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన అంశాలను గమనించినట్టయితే మాత్రం పెత్తనం చెలాయించిన పోలీసు అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేసుకున్న తీరు విస్మయం కల్గిస్తోంది. డీజీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉన్న పోలీసు విభాగంలో ఓఎస్డీలుగా వ్యవరించిన రిటైర్డ్ పోలీసు అధికారులు ఆ స్థాయి స్వేచ్ఛ ఎలా దొరికిందన్నది..? వీరు విచ్చలవిడిగ పోలీసు వ్యవస్థను చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో వినియోగించుకోవడానికి కారణం ఏంటీ..? ఇలాంటి ప్రశ్నలు అటు పోలీసు విభాగం నుండి ఇటు సమాజం నుండి ఎదురవుతున్నాయి.