దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ నాయకుడు ఒకరు మృతి చెందినట్టు అధికారవర్గాలు తెలిపాయి. మంగళవారం బీజాపూర్ అటవీ ప్రాంతంలోని కొరంజెడ్, బందెపారా అటవీ ప్రాంతంలో 15 నుండి 20 మంది మావోయిస్టులు షెల్టర్ తీసుకున్న సమాచారం అందుకున్న పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ 170 బెటాలియన్ కు చెందిన బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. కొరంజెడ్, బందెపారా అటవీ ప్రాంతంలో కూంబింగ్ బలగాలకు ఏరియా కమిటీ ఇంఛార్జి డీవీసీఎం నగేష్, సెక్రటరీ ఏసీఎం బుచ్చున్న, ఏసీఎం విశ్వనాథ్ లతో పాటు 20 మంది మావోయిస్టు పార్టీ నక్సల్స్ తారసపడడంతో ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. బందేపారా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో డీవీసీఎం నగేష్ మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం తెలుస్తోంది. ఘటనా స్థలం నుండి పోలీసులు ఒక ఏకె 47 ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల ఘటన అనంతరం బలగాలు సమీప అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.