బుల్లెట్ బండి ఎత్తుకెళ్లిన ఘరానా దొంగ
దిశ దశ, కరీంనగర్:
అది ఎప్పూడు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతం… అక్కడో మనిషి నిలబడి ఉన్నాడు… అటు ఇటు వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి… అటుగా వస్తున్న ఓ బుల్లెట్ వాలాను ఆయన ఇటు రావాలని సైగ చేశాడు. అతను రహదారిపైనే తన బైక్ ఆపాడు… అక్కడకు వెల్లిన ఆ అగంతకుడు వారికి ఓ మాట చెప్పగానే బైక్ వాలా రోడ్డు పక్కకు వచ్చాడు… అగంతకుడు చెప్పిన మాటలు విన్న బైక్ వాలా అతనికి తన వాహనాన్ని అప్పగించాడు… తన ద్విచక్ర వాహనం పట్టుకెళ్లిన వ్యక్తి కోసం ఎదురు చూస్తూనే… ఉన్నాడు… చివరకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు… కరీంనగర్ నడి బొడ్డున జరిగిన ఈ ఘటన దొంగల అతి తెలివికి పరాకాష్టగా నిలిస్తే… ఎస్సై పేరు చెప్పగానే వెనకా ముందు ఆలోచించకుండా తన వాహానాన్ని అప్పగించిన బైక్ వాలా తీరు విస్మయానికి గురి చేసింది.
శాస్త్రీ రోడ్ లో…
కరీంనగర్ శాస్త్రీ రోడ్ లోని మెడికల్ ఏజెన్సీలు ఉన్న ఓ వీధిలో శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన విచిత్ర దొంగతనం అందరిని ఆశ్చర్యపర్చింది. రద్దీగా ఉన్న ప్రాంతంలో రోడ్డు పక్కన నిలబడిన అగంతకుడు ప్రత్యేకంగా బుల్లెట్ వాహనంపై వెల్తున్న అతన్ని ఆపి రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఎస్సైని తీసుకవచ్చేందుకు బైక్ ఇవ్వాలని అడిగి మరీ తీసుకెళ్లాడు. తన రాయల్ ఇన్ ఫీల్డ్ నంబర్ TS02EX7852 బైక్ ను తీసుకెళ్లిన అగంతకుడు ఎంతకీ తిరిగి రాకపోయే సరికి అనుమానం వచ్చిన బైక్ వాలా బొజ్జ శివం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగలోకి దిగి సీసీ ఫుటేజీ ఆదారంగా నిందితుని కోసం ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు.
ఎన్నోవాహనాలు …
అయితే శివం వెల్తున్న క్రమంలో అతన్ని మాత్రమే ఆపి మరీ బైక్ అడిగి అగంతకుడు ఎత్తుకెళ్లిన తీరు విస్మయం కల్గిస్తోంది. బాధితుని నుండి బైక్ అడిగినప్పుడు ఆదే రోడ్డు మీదుగా ఇతర వాహనాలు చాలా వెల్తున్నాయి. ఆ బైక్ లను ఆపకుండా ప్రత్యేకండా బుల్లెట్ పై వెల్తున్న శివంనే ఎందుకు ఆపాల్సి వచ్చిందోనన్న అనుమానం వస్తే అసలు అతని చేతికి వాహనం ఇచ్చే అవకాశమే ఉండకపోయేది. అంతేకాకుండా పోలీసు యంత్రాంగానికి సరిపడా వాహనాలను ప్రభుత్వం సమకూర్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎస్సై ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే పెట్రో కార్ ఆ ప్రాంతనికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోయినట్టయితే వాకీటాకీలోనో, మొబైల్ ద్వారానో ట్రాఫిక్ కంట్రోల్ కోసం బైకులపై పెట్రోలింగ్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లను పిలిపించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడో ఉన్న ఎస్సైని శాస్త్రీరోడ్ కు తీసుకొచ్చేందుకు అక్కడి నుండే బైక్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉండదన్నది వాస్తవం. సదరు ఎస్సై ఉన్న ప్రాంతంలో రోడ్డుపై నిలబడితే ఎవరిని లిఫ్ట్ అడిగినా వారు ఎస్సైని గమ్యస్థానం వద్ద దించి వెల్లే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ విషయాలేవి పట్టించుకోకుండా తాను పోలీసు కానిస్టేబుల్ ను అని పరిచయం చేసుకుని ఎస్సైని తీసువచ్చేందుకు బైక్ ఇవ్వాలని అడగగానే అతనికి అప్పగించడం విచిత్రంగా ఉంది. ఆ ప్రాంతం మీదుగా వెల్తున్న ఇతర బైకులను ఆపి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా… ఎస్సైకి వాహనం లేకపోవడం ఏంటీ అన్న అనుమానం అతనిలో వచ్చినట్టయితే బైక్ చోరీ కాకపోయేది. కానీ పోలీసని చెప్పగానే అతనికి బుల్లెట్ అప్పగించిన శివం రూ. 90 వేల బైక్ ను పొగొట్టుకోవల్సి వచ్చింది.