మృత్యువు నిన్ను తీసుకెళ్లింది మిత్రమా… నీ జ్ఞాపకాలను మాత్రం కాదు…

దిశ దశ, జగిత్యాల:

బౌతికంగా మమ్మల్ని వీడిపోయినా మా హృదయాల్లో మాత్రం నీవు చిరస్థాయిగా నిలిచిపోయావు మిత్రమా… నిన్ను మృత్యువు తీసుకెళ్లింది కావచ్చు కానీ నీతో కలిసి తిరిగిన ఆ జ్ఞాపకాలు మాత్రం మా హృదయాల్లో పదిలంగా ఉన్నాయి అంటున్నారు ఆ యువకులు. నీ జీవితాన్ని శాసించిన మరణం… మన స్నేహితపు తీపి గుర్తులను మాత్రం శాసించలేకపోయింది. హితుడా ఓ స్నేహితుడా తుది శ్వాస వీడినా నీవు మాత్రం మా గుండెల్లో మాత్రం జీవించే ఉన్నావంటూ ఆ యువకులు చనిపోయిన తమ మిత్రుడికి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… తెలంగాణలోని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన మోహిన్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. తమతో కలివిడిగా ఉంటూ ఆడిపాడిన తమ చిన్ననాటి స్నేహితుడు కానరాని లోకానికి చేరినా వారు మాత్రం మోహిన్ ఖాన్ సాన్నిహిత్యపు మధుర జ్ఞాపకాలను మాత్రం వీడ లేకపోతున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో కబళించిన మోహిన్ ఖాన్ ఇంకా తమ మధ్యే తిరుగుతున్నాడని వారు భావిస్తూనే ఉన్నారు. మంగళవారం మోహిన్ ఖాన్ జన్మదిన కావడంతో భీమారం గ్రామంలో అతను బ్రతికున్నట్టుగానే వేడుకలు నిర్వహించారు. గ్రామంలోని పలు చోట్ల మోహిన్ ఖాన్ కు బర్త్ డే విషెస్ చెప్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు అతని సమాధిని అలంకరించి అక్కడే జన్మదినోత్సవాన్ని కూడా జరిపించారు. బ్రతికున్న మనుషులనే తమవాళ్లు మర్చిపోతున్నట్టుగా నటిస్తూ జీవిస్తున్న ఈ కాలంలో చనిపోయిన తమ స్నేహితుడి బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిపించిన భీమారం యువత తమలోని మానవత్వాన్ని చేతల్లో ప్రదర్శించారు. వీరు చేసిన ఈ వేడుకల గురించి విన్న ప్రతి ఒక్కరూ కూడా వారిని అభినందిస్తున్నారు.

You cannot copy content of this page