కరీంనగర్ లో ఎగబడ్డ జనం
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ తెలంగాణ చౌక్ లోని కొద్దిపాటి వెడల్పు రోడ్డుతో ఉన్న వీధి అది… మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా వందలాది మంది అక్కడ గుమి గూడారు. మిట్ట మద్యాహ్నం కొంతమంది క్యూ లైన్లలో నిలబడి ఉంటే మరి కొంతమంది లోపలకు చొరబడేందుకు ప్రయత్నించారు. బిర్యాని అక్కడ ఒక్క రూపాయికే విక్రయిస్తున్నారన్న ప్రచారం గుప్పుమనడంతో వందలాది మంది ఆ బిర్యానీ సెంటర్ వద్ద ఎగబడ్డారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే తెలంగాణ చౌక్ లోని ఓ పక్క రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోగా, చాతాడంతగా ఏర్పడిన క్యూను చూసి అసలక్కడేం జరుగుతోందో తెలియక అయోమయానికి గురయ్యారు. చివరకు తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు రంగంలోకి దిగారు.
కరీంనగర్ తెలంగాణ చౌక్ లో…
కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో ది ఎంపైర్ హోటల్ ను శుక్రవారం ప్రారంభించారు. ఓపెనింగ్ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు హోటల్ యజమాని కాస్తా వెరైటీగా తన హోటల్ ప్రచారాన్ని చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక రూపాయి నోటు ఇచ్చిన వారికి బిర్యానీ అంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఆ నోటా ఈ నోటా పాకడంతో ఒక రూపాయి నోట్లను సేకరించి మరీ ఆ హోటల్ వద్దకు వినియోగదారులు చేరుకున్నారు. దీంతో ఓ చిన్నపాటి సందుగా ఉన్న ఆ రోడ్డులో వందలాదిమంది చేరి క్యూ కట్టారు. క్రమ క్రమంగా జనం పెరగడంతో కొంతమంది హోటల్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మద్యాహ్నం 2.30 గంటల తరువాత అని హోటల్ యాజమాన్యం ప్రకటించినప్పటికీ అంతకు ముందే బిర్యానీ కోసం బారులు తీరారు. ఒక రూపాయికే బిర్యాని ఆఫర్ ప్రకటనతో ముందు జనం క్యూ కట్టి వెయిట్ చేసినప్పటికీ సహనం కోల్పోయిన కొందరు లోపలకు చొరబడ్డారు. ఎంపైర్ హోటల్ లో బిర్యాని కోసం వచ్చిన వారి కారణంగా తెలంగాణ చౌక్ లోని ఓ రోడ్డుపై వందాలాది వాహనాలు పార్క్ చేశారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతం మీదుగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పోలీసుల ఎంట్రీ…
ఒక రూపాయి బిర్యానీ క్యాంపెయిన్ ఎఫెక్ట్ తో జనం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడం.. హోటళ్లోకి చొరబడుతున్న క్రమంలో తొక్కిసలాటే జరిగే ప్రమాదం ఉందని గమనించారు పోలీసులు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హోటల్ వద్దకు చేరుకున్న వారందరిని పంపించేసి ఎంపైర్ హోటల్ ను మూయించారు. ఓపెనింగ్ రోజే తన హోటల్ గురించి జనాలకు తెలపాలని యజమాని వేసుకున్న స్కెచ్ వర్కౌట్ అయినప్పటికీ జనం తోసుకుంటున్న సమాచారం అందుకుని పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆ హోటల్ ప్రారంభించిన కొద్ది సేపటికే తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అంటే ఇదేనేమో అనుకుంటూ అక్కడకు వచ్చిన వారు అక్కడి నుండి వెల్లిపోవడం కొసమెరుపు.