తెలంగాణ ప్రభుత్వంపై మావోయిస్టుల ఫైర్… బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని విమర్శ…

దిశ దశ, వరంగల్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా పాలన పేరిట నరహంతక పాలన కొనసాగిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రక్తం ఏరులై పారిస్తోందని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వేర్వేరు కాదని, వేర్వేరు ముఖాలు కలిగిన ఒకే రూపమని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే పనిచేస్తున్నాయి. ఈ కారణంగానే తెలంగాణలో ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని జగన్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం అడవుల్లో అన్నే సంతోష్ సహా ముగ్గురిని, కొత్గగూడెం జిల్లా దామెరతోగులో విజయేందర్ ను, తాజాగా రఘునాథపాలెం వద్ద ఆరుగురిని ఎన్ కౌంటర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం హత్య చేయించిందని జగన్ మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు సాయుధ బలగాల మద్దతుతో పాటు ఆర్థిక వనరులు కావాలని అభ్యర్థించారని అప్పటి నుండే రాష్ట్రంలో మావోయిస్టులపై నిర్భందం పెంచారని దుయ్యబట్టారు.

ఇన్ ఫార్మర్ల వల్లే…

చత్తీస్ గడ్ లోని అండ్రీలో జరిగిన ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు ఏసోబుతో పాటు మరో 8 మంది మావోయిస్టులు మరణించాడనికి కారణంగా పార్టీ ద్రోహి పోలీసులకు ఇచ్చిన సమాచారం వల్లేనని జగన్ ఆరోపించారు. 1978లో విప్లవ రైతు కూలీ సంఘంలో చేరిన ఏసోబు 1991లో పీపుల్స్ వార్ పార్టీలో పూర్తిస్థాయి విప్లవకారునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారన్నారు. మైదాన ప్రాంత ఉద్యమాలను విస్తరించేందుకు గెరిల్లా యుద్దాన్ని అభివృద్ది చేశారని జగన్ వివరించారు. 2023లో దండకారణ్య ప్రాంతానికి చేరుకుని జనతన్ సర్కార్ లో వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ది చేశారన్నారు. కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ కూడా విప్లవ ద్రోహి అందించిన సమాచారమేనని జగన్ స్పష్టం చేశారు. ఈ ఎన్ కౌంటర్ కు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

You cannot copy content of this page