రెండు పార్టీల నినాదం ఒకటే…

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం బీజేపీ వర్సెస్ టీఆరెఎస్. ఈ రెండు పార్టీలు కూడా ప్రచ్ఛన్న యుద్దం కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పార్టీల పోరును తెలంగాణ ప్రజలు ఎలా రిసివ్ చేసుకుంటారో తేలాలంటే మరో 10 నెలలు ఆగాల్సిందే. కానీ బీజేపీ, టీఆరెఎస్ నాయకులు ఇక నుండి మాటల యుద్దానికి మాత్రం తెరలేపనున్నారు. తెలంగాణాలో తమ పట్టు నిలుపుకోవాలని టీఆరెఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తే… పై చేయిగా నిలిచేందుకు బీజేపీ రంగంలోకి దిగబోతోంది. అయితే ఈ రెండు పార్టీలు కూడా ఒకే నినాదంతో రంగంలోకి దిగబోతున్నాయి.

నినాదం ఒకటే..

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రభావితం చూపాలనకుంటున్న బీజేపీ, టీఆరెఎస్ పార్టీలు కూడా ఇప్పుడు ఒకే నినాదాన్ని ఆసరగా చేసుకుని ముందుకు సాగాలని భావిస్తున్నాయి. జాతీయ వాదాన్ని ఎత్తుకుంటూ హిందుత్వ నినాదం వినిపిస్తూ దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ స్లోగన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని తామే కాపాడతామని, బారత మూలాలు అవేనంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తామని ఈ విషయాన్ని ఇతర పార్టీలు విస్మరిస్తున్నాయని కూడా బీజేపీ ఆరోపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలను బలహీన పర్చలన్న లక్ష్యంతో సాగుతున్న దేశం కోసం ధర్మం కోసం అన్న పిలుపును ఇస్తూ 80 శాతం ఉన్న హిందువుల్లో చైతన్యం నింపి బీజేపీని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తోంది. ఉత్తారాది రాష్ట్రాల్లో సక్సెస్ బాటలో నడుస్తున్న బీజేపీ ఇదే ఊపుతో తెలంగాణాలోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకు తగినట్టుగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హిందూ నినాదమే ఏజెండాగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీని మట్టికరిపించాలంటే యువతలో క్రేజీ సంపాదించిన బీజేపీ ఇక వృద్దులను లక్ష్యం చేసుకుని ధర్మ ఆచరణను ప్రబోదించే విధంగా స్కెచ్ వేయబోతోంది.

టీఆరెఎస్ అదే పిలుపు…

తాజాగా టీఆరెఎస్ పార్టీ కూడా అదే బాటలో పయనించనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ భవన్ లో మంగళవారం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్, పార్టీ అధినేత కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. బీజేపీపై ధర్మయుద్దం చేస్తామని ఆ పార్టీ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా పావులు కదపాలని నిర్ణయించినట్టు సీఎం వెల్లడించారు. బీజేపీ అధికారంలో లేని 8 రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చిందని, ఇదే పద్దతిన ఏపీ, తెలంగాణాలో కూడా అమలు చేయాలని చూసిందని కేసీఆర్ ఆరోపించారు. అయితే తెలంగాణాలో బీజేపీ చేసిన ఎత్తుగడలను మొదట్లోనే అడ్డుకోగలిగామని లేనట్టయితే తెలంగాణాలో అస్థిరత్వం ఏర్పర్చే కుట్ర చేశారన్నారు. బీజేపీ వేసిన స్కెచ్ లకు సంబందించిన పూర్తి సమాచారం 5 లక్షల పేజీల్లో ఉందని ప్రకటించిన సీఎం కాషాయ పార్టీ వద్ద రూ. 2 లక్షల కోట్లు ఉన్నాయని సింహయాజి చెప్తున్నారన్నారు. ఇందుకు సంబందించిన ఆధారాలను దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలకు పంపించామని, రాష్ట్రంలో కూడా బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టే విధంగా ధర్మ యుద్దం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీనే టార్గెట్ చేస్తూ ముందుకు సాగాలని 8 ఏళ్లలో ఈడీ అనేక కేసులు పెట్టిన అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. ఇక నుండి బీజేపీని ఏకి పారేసే విధంగా వ్వవహరించాలని కూడా సీఎం ప్రకటించడం గమనార్హం.

ధర్మ పోరాటంలో…

అయితే రాష్ట్రంలో ముందు వరసలో నిలుస్తున్న టీఆరెఎస్, బీజేపీ పార్టీలు రెండు కూడా ధర్మపోరాటంతోనే ముందుకు సాగాలని నిర్ణయించడం గమనార్హం. దేశం కోసం ధర్మం కోసం అంటూ జాతీయ వాదాన్ని హిందుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెల్లే విధంగా బీజేపీ ఎత్తులు వేస్తుంటే బీజీపీపైనే ధర్మయుద్దం చేయాలని టీఆరెఎస్ భావిస్తోంది. ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ ధర్మం వైపు ఉందోనన్న విషయం ఇక్కడి ప్రజలే నిర్ణయించాల్సి ఉంది.

You cannot copy content of this page