లోకసభ ఎన్నికల కోసం కమలం భారీ స్కెచ్…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

లోకసభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సాధించుకునేందుకు అవసరమైన వ్యూహాలతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ప్రత్యర్థి పార్టీల కన్నా ముందే ప్రజా క్షేత్రంలోకి వెల్లే విధంగా కార్యాచరణ రూపొందించింది. న్యూ ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన పదాదికారుల సమావేశంలో పలు అంశాలపై చర్చించిన బీజేపీ జాతీయ నాయకత్వం రానున్న లోకసభ ఎన్నికల్లో గెలుపు కోసం ఎలా వ్యవహరించాలో దిశా నిర్దేశం చేసింది.

50 శాతం ఓట్లే లక్ష్యం…

లోకసభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లను రాబట్టాలన్న లక్ష్యాన్ని నిర్దేశించకున్న బీజేపీ అగ్ర నేతలు ఆ దిశగా పావులు కదపడం ఆరంభించారు. దేశ వ్యాప్తంగా క్లసర్లను ఎంపిక చేసిన బీజేపీ నాయకులు జనవరి 15 నుండి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. క్లస్టర్ల వారిగా చేపట్టే సమావేశాలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ అధ్యక్షుడు నడ్డాలు ప్రసగించనున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న పార్టీ శ్రేణులతో మమేకం అయి వారిలో నూతన ఉత్సాహం నింపడం, అలాగే బీజేపీ ప్రభుత్వం వల్ల భారత దేశానికి వచ్చిన గుర్తింపు తదితర అంశాలన్నింటిపై వివరించనున్నారు. మరో వైపున యువ మోర్చ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 5వేల సదస్సులు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఈ సదస్సుల ద్వారా యువతను కాషాయం వైపు మల్చడం, కొత్త ఓటర్లను ఆకట్టుకోవాలని నిర్ణయించారు.

రామ మందిర్…

ఈ ఎన్నికల్లోనూ శ్రీ రామ జపం అందుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇంతకాలం రామ జన్మ భూమి వద్ద ఆలయం కూల్చివేత అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఇప్పుడు మాత్రం రామ మందిరాన్ని నిర్మించిన ఘనతను ప్రజలకు చెప్పుకోవాలని నిర్ణయించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జనవరి 22న ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి 1 నుండి రామ మందిర ఉత్సవాలను నిర్వహించాలని, బీజేపీకి చెందిన ప్రతి ఒక్కరూ కూడా దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. దేశంలోని 10 కోట్ల కుటుంబాలను కలిసి ‘దియా మెరుపు’ కార్యక్రమం గురించి వివరించాలని భావిస్తోంది.

ముందస్తు ప్రకటన…

ఇకపోతే ఈ సారి ముందస్తుగానే లోకసభ అభ్యర్థుల ప్రకటన చేయాలని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. మధ్యప్రదేష్, చత్తీస్ గడ్ రాష్ట్రాలలో ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనతో సానుకూల ఫలితాలను రాబట్టినట్టుగానే లోకసభ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. పార్టీ బలహీనంగా ప్రాంతాల్లో అభ్యర్థుల ముందస్తు ప్రకటన తమకు బాగా లాభిస్తుందని అంచనా వేస్తున్న జాతీయ నాయకత్వం ఈ సారి దక్షిణాది రాష్ట్రాలలో అదే విధానాన్ని అమలు చేయాలని అనుకుంటోంది. దీంతో పోలీంగ్ నాటికి అభ్యర్థులు ప్రజలతో మమేకం కావడంతో పాటు ప్రచారానికి కావాల్సినంత సమయం చిక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విధానం వల్ల అభ్యర్థులు కూడా ప్రజలను తమకు అనుకూలంగా మల్చుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నట్టు సమాచారం.

You cannot copy content of this page