వివాదంలో బీజేపీ నేత బాబు మోహన్.. సంచలన ఆడియో లీక్

మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ కార్యకర్తపై ఆయన అనుచితంగా ప్రవర్తించడం చిచ్చు రేపుతోంది. ఆయన తీరుపై కాషాయ శ్రేణులు మండిపడున్నారు. ఫోన్ చేసిన కార్యకర్తపై ఇలా ఇష్టమొచ్చినట్లు అసభ్యకరంగా తిట్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.

తన నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్తపై బాబు మోహన్ రెచ్చిపోయారు. పార్టీలో మీతో కలిసి పనిచేస్తానంటూ ఓ కార్యకర్త బాబు మోహన్‌కు కాల్ చేశారు. దీంతో బాబు మోహన్ సదరు కార్యకర్తపై తిట్ల దండకం అందుకున్నారు. ‘ఎవడ్రా నువ్వు.. నీ స్థాయి ఎంత.. నీ బ్రతుకెంత అసలు.. ఇంకోసారి ఫోన్ చేస్తే చెప్పు తీసుకుని కొడతా గాడిద.. రెండు రాష్ట్రాలకు ఉపయోగపడతానని నన్ను అమిత్ షా పార్టీలోకి తీసుకున్నారు. రేపే బీజేపీకి రాజీనామా చేస్తా.. నువ్వు కావాలో.. నేను కావాలో పార్టీనే తేల్చుకుంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

‘నీ వయసు ఎంత గాడిద.. బండి సంజయ్ ఎవడ్రా.. వాడు నా తమ్ముడు.. జోగిపేట సెంటర్ లో నిన్ను చెప్పు తీసుకుని కొడతా’ అని అన్నట్లు ఆడియోలో ఉంది. కార్యకర్త జోగిపేటకు చెందిన వెంకటరమణగా తెలుస్తోంది. బండి సంజయ్ ను కూడా కించపరిచేలా ఆ ఆడియోలో మాట్లాడినట్లు ఉంది. ఇప్పుడు ఆ ఆడియో బీజేపీలో కలకలం సృష్టిస్తుంది.

అందోల్ నియోజకవర్గం నుంచి బాబు మోహన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సొంత నియోజకవర్గానికి చెందిన కార్యకర్తపై బాబు మోహన్ బూతు పురాణం అందించడం కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున అందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆడియో బయటపడం సంచలనంగా మారింది. అందోల్ నియోజకర్గంలో గతంలో టీడీపీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబు మోహన్. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఇక 2014లో టీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ తరపున గెలిచారు.

You cannot copy content of this page