దిశ దశ, హన్మకొండ:
అధిష్టానం ఎక్కడి నుండి ఎంపీగా పోటీ చేయాలని సూచిస్తే తాను అక్కడి నుండి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం ఆయన హన్మకొండ జిల్లా కమలాపూర్ లో మీడియాతో మాట్లాడుతూ… తాజా ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ రాచరిక పాలనకు అంతం పలికారన్నారు. హుజురాబాద్ లో బ్లాక్ మెయిల్ రాజకీయం నడిచిందని, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే దళిత బంధు, కళ్యాణ లక్ష్మీ, ఫించన్లు ఆపేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మీ చెక్కుల కోసం తాను సంతకం చేస్తే వాటిని అధికార పార్టీ నాయకులు పంపిణీ చేశారన్నారు. అధికారులు కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు చేపట్టారన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా హుజురాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఉప ఎన్నికల్లో తాను గెలిచిన తరువాత హుజురాబాద్ పై కేసీఆర్ కత్తిగట్టారని, అధికారిక కార్యక్రమాలకు పిలవకుండా తనను ప్రజలకు దూరం చేశారని మండిపడ్డారు.