కేంద్రం రాష్ట్రం తీరు…
బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా..? బీఆర్ఎస్ పార్టీ నిజమేనని ఒప్పుకుంటోందా..? ఈ విషయపై సామాన్యుడు తర్జన భర్జన పడుతున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఆరోపణల పర్వంలో ఎవరి ఆదిపత్యం కనపడుతోంది..? యూనియన్ గవర్నమెంట్ కాలు అడ్డం పెట్టగానే రాష్ట్రంలోని అధికార పార్టీ ఆందోళనలకు దిగుతోంది. ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకతను పెంచిపోషించే ప్రయత్నం చేస్తోంది. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కార్ వేస్తున్న ఎత్తులో బీఆర్ఎస్ పార్టీ నేతలు చిత్తవుతున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది.
మొన్న అలా…
వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా రాష్ట్ర నిధులతోనే కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వాం. చాలా సీజన్లలో ఇదే విషయాన్ని నొక్కి చెప్తూ రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించడం వల్లే తాము ఈ సాహసం చేస్తున్నామని ప్రకటించిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సాహసంతో తీసుకున్న ఈ నిర్ణయం వెనక కేంద్రం సహకారం లేదని పదే పదే చెప్తూ వచ్చింది. గత సీజన్ కు ముందు కేంద్ర ప్రభుత్వ ధాన్యం సేకరణపై మెలికపెట్టడంతో రాష్ట్రంలోని అధికారపార్టీ అగ్గిమీద గుగ్గిలం అయింది. కేంద్రం వైఖరి నిరసించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలు చేపట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలను ఎండగడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నుండి మొదలు సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ నిరసనలు తెలిపారు. ఆ తరువాత ఈ విషయం సద్దుమణిగింది.
ఇప్పుడిలా…
తాజాగా మరోసారి బీఆర్ఎస్ పార్టీ నిరసనల పర్వానికి శ్రీకారం చుట్టింది. వరి ధాన్యం ఆరబోసేందుకు కళ్లాల వద్దే సిమెంట్ ప్లాట్ ఫాంల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండుమూడేళ్లుగా రైతులకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించింది. ఈ మేరకు రైతులు కూడా పంట పొలాల్లోనే ప్లాట్ ఫాంల నిర్మాణానికి ముందుకు వచ్చారు. దీనివల్ల రైతులు పొలాల వద్దే ధాన్యాన్ని ఆర బెట్టినట్టయితే మాయిశ్భర్(తేమ) శాతం తగ్గిపోతుందని వాటిని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే నేరుగా విక్రయించుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాట్ ఫాంల కొనుగోలు విషయంపై అభ్యంతరాలు చెప్పింది. మహాత్మా గాంధీ నరేగా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేసిన ఈ నిధులను ప్లాట్ ఫాం నిర్మాణాలకు వినియోగించారని, నిభందనలకు విరుద్దగా ఖర్చు చేశారని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో కేంద్రంపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ అయింది. కావాలనే కేంద్రం కుట్రలు చేస్తోందంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల చేపట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
సెల్ఫ్ గోలా..?
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం అందించనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సాహసంతో కూడుకుని నిధులు వెచ్చిస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరుచూ చెప్తూ ఉండేది. స్వరాష్ట్రం సిద్దించిన తరువాత అటు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని బల్లగుద్ది మరీ చెప్పారు. దీంతో రాష్ట్రంలోని కొంతమందిలో కేంద్రం అంటే ఓ రకమైన వ్యతిరేక భావన కూడా నెలకొంది. కేసీఆర్ ప్రభుత్వం చాలా గొప్పదనే నమ్కకాన్ని బలంగా నాటుకపోయేలే తయరు చేసుకుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆందోళనలు చేపడుతుండడంతో తెలంగాణ ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెల్తాయి. ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విషయం తప్పని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆందోళనల ద్వారా ఒప్పుకుంటున్న విషయాన్ని ప్రజలు గుర్తించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కేంద్ర ఎలాంటి సాయం చేయలేదని చెప్పిన వారి నుండే కేంద్రం నిధులు ఇవ్వకుండా అభివృద్దిని అడ్డుకుంటుందన్న వాఖ్యలు వెలువడుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ నాయకుల తీరుపై ప్రజల్లో సరికొత్త చర్చకు తెరలేపినట్టవుతుందని, బీఆర్ఎస్ చెప్పినవన్ని అబద్దాలేనా అన్న అనుమానాన్ని రేకేత్తించినట్టు అవుతుందన్న విషయాన్ని విస్మరించారు. ఇదే సమయంలో బీజేపీ నాయకులు కూడా కేంద్రం ఏఏ పథకాలకు నిధులు ఇస్తున్నదో వివరిస్తూ గ్రామా గ్రామాన ప్రచారం చేస్తోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టి బీజేపీ లాభపడేలా స్కెచ్ వేసినట్టుగా అర్థం అవుతోంది. ఈ ఎత్తుగడలను గమనిస్తుంటే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నాయకులతోనే కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పకనే చెప్పిస్తోందని స్పష్టం అవుతోంది.