దమ్ముంటే అన్ని స్థానాల్లో పోటీ చేయాలి

ఎంఐఎంపై బీఎస్కే ఫైర్…

దిశ దశ, కరీంనగర్:

ఎంఐఎం పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. ఓల్డ్ సిటీ న్యూ సిటీగా ఎందుకు మారలేదో చెప్పాలని, అక్కడి యువతకు ఎందుకు ఉద్యోగాలు రావడం లేదో వివరించాలని డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్ లో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భూమి పూజకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఎంఐఎం పార్టీ తీరుపై దుయ్యబట్టారు. పాత బస్తీలో ఒక్క కంపెనీ కూడా ఎందుకు రాలేదు, అభివృద్ది ఎందుకు జరగడం లేదని, అక్కడి యువతకు పాస్ పోర్టులు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదని, అక్కడ అభివృద్ది ఎందుకు కానరావడం లేదంటూ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో పోటీ చేసే సత్తా ఎంఐఎంకు లేదని, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తుందని ఆరోపించారు. తమ ఆస్తులు పెంచుకోవడానికే ఎంఐఎం చీఫ్ ప్రయత్నిస్తారని, ముస్లిం ఓటు బ్యాకుంగా మార్చుకుని వారి జీవితాలను నాశనం చేసిన పార్టీ ఎంఐఎమేనని సంజయ్ ధ్వజమొత్తారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తోందన్నారు. ఈ మూడు పార్టీల లక్ష్యం బీజేపీని ఓడించడమే తప్ప మరోటి కాదని బండి సంజయ్ అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో చేతులు కలపడం ఓవైసీకి కామన్ గా మారిందని, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ చేతులు కలిపిందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. దమ్ముంటే రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలని, డిపాజిట్ కూడా రాదని బండి జోస్యం చెప్పారు. ముస్లిం సమాజం కూడా ఎంఐఎం పార్టీని ఛీత్కరించే పరిస్థితి వచ్చిందని, ఆ పార్టీని పట్టించుకునే పరిస్థితులో వారు లేరని, ప్లేట్ ఫిరాయించి బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందూ దేవుళ్లను, వేడుకలను కించపర్చే ఎంఐఎం పార్టీతో చేతులు కలిపిన పార్టీలు హిందూ సమాజంపై ఎలాంటి తీరు కనబరుస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ ముస్లిం సమాజం కోసం ఎంఐఎం కొట్లాడే పార్టే అయినట్టితే రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. దారుస్సాలంలో కూర్చుని చేస్తున్న ప్రేలాపనలు మాని రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలన్నారు. శంషాబాద్ లో ఓ వ్యాపారి అమిత్ షాకు ఇళ్లు కట్టించాడని ఇకపై ఆయన ఇక్కడే ఉంటారంటూ ఎంఐఎం చేసిన ఆరోపణలను బండి సంజయ్ ఖండించారు. ఆయనకు టెర్రిరస్టు సంస్థ ఆయనకు చెప్పి ఉంటుందేమోనని, ఆ ఇంటికి అమిత్ షా వస్తే పేల్చాలని కుట్రలు చేస్తున్నారమోనంటూ వ్యంగస్త్రాలు విసిరారు. తమ పార్టీ అగ్రనేత గురించి మాకు తెలియకుండా ఇతర పార్టీ నేతకు తెలుస్తుందా అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

అప్పుడే…

రాష్ట్రంలో ఇక ముందు నిర్వహించబోయే ప్రజా సంగ్రామ యాత్ర బస్సులోనా లేక పాదయాత్రగా సాగాలో అన్న విషయంపై ముఖ్య నేతలతో సమావేశం అయి నిర్ణయం తీసుకుంటామని బండి సంజయ్ వివరించారు. సమిష్టి నిర్ణయం తీసుకున్న తరువాత ప్రజాక్షేత్రంలోకి మరోసారి అడుగుపెడ్తానని ప్రకటించారు. ఏక్ నిరంజన్ పార్టీ కానందును సమిష్టి నాయకత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు నడుచుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆయన వెంట బీజేపీ నాయకులు బోయినపల్లి ప్రవీణ్ రావు, సొల్లు అజయ్ వర్మ, కర్ణాకర్ (చిట్టీ), బండ రమణా రెడ్డి, రాపర్తి ప్రసాద్, డాక్టర్ పుల్లెల్ల పవన్, శ్రీనివాస్, మహేష్ తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page