అర్థరాత్రి పోలీసుల ఎంట్రీ
బొమ్మల రామారం ఠాణాకు తరలింపు
దిశ దశ, హైదరాబాద్, కరీంనగర్:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం అర్థరాత్రి 12.10 గంటల ప్రాంతంలో జ్యోతినగర్ లోని బండి సంజయ్ ఇంటి వద్దకు కరీంనగర్ రూరల్ ఏసీపీలు తుల శ్రీనివాసరావు, తాండ్ర కర్ణాకర్ రావు, సీఐలు లక్ష్మీ బాబు, నటేష్ తో పాటు పలువురు పోలీసులు చేరుకున్నారు. అప్పటికే ఆయన ఇంటి వద్ద భారీగా కార్యకర్తలు ఉండడంతో పోలీసులు లోపలకు వెల్లకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏసీపీలు తుల శ్రీనివాసరావు, తాండ్ర కర్ణాకర్ రావులు లోపలకు వెల్లి సంజయ్ ని అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు. తనపై ఏం కేసు ఉంది, రికార్డు తీయండంటూ అడిగడంతో పోలీసులు ఏం సమాధానం చెప్పలేదు. కేసు వివరాలు లేవు వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ సంజయ్ ప్రశ్నించారు. అయితే పోలీసులు సంజయ్ ని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ద్వితీయ శ్రేణి నాయకులు అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం పట్టు వీడకుండా 12.50 గంటల సమయంలో సంజయ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో లోయర్ మానేరు డ్యాం సమీపంలో బండి సంజయ్ ని అరెస్ట్ చేసి తీసుకెల్తున్న పోలీసు వాహనం మొరాయింయడంతో మరో వాహనంలోకి ఎక్కించి సంజయ్ ని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కారణం ఇదేనా..?
అయితే మంగళవారం రాత్రి కరీంనగర్ లోని జ్యోతినగర్ కు చేరుకున్న బండి సంజయ్ ని హుటాహుటిన పోలీసులు ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. ఆయన ఇంటికి చేరుకున్న కొద్దిసేపట్లోనే అరెస్ట్ చేయడం వెనక కారణాలు ఏంటన్నది మాత్రం పోలీసు అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే అర్థరాత్రి సమయంలో బండి సంజయ్ హైదరాబాద్ బయలుదేరుతున్నారని సిద్దిపేట బైపాస్ రోడ్డులోని రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద మీడియాతో మాట్లాడుతారని బీజేపీ నేతలు ప్రెస్ రిలీజ్ చేసినట్టు సమాచారం. అక్కడి నుండి హైదరాబాద్ కు వెల్లి ఈ రోజు పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ కు సంబంధించిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందన్న సమాచారం మేరకు ఉన్నతాధికారులు బండి సంజయ్ ని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసు అధికారులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్ఫష్టత ఇవ్వడం లేదు. ముందస్తు అరెస్ట్ లో భాగంగా సంజయ్ ని తరలించారా లేక మరేదైనా కారణం ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది.
వరంగల్ సీపీ స్టేట్ మెంట్…
మంగళవారం వరంగల్ కమిషనరేట్ పరిధిలో పదోతరగతి హిందీ పేపర్ బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న వరంగల్ సీపీ రంగనాథ్ గంటల వ్యవధిలోనే సైబర్ టీమ్స్ ద్వారా వాట్సప్ లో షేర్ అయిన హిందీపేపర్ గురించి పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నట్టు సీపీ రంగనాథ్ తెలిపారు. కమలాపూర్ స్కూల్ నుండి ఈ పేపర్ లీకయిందని వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బండి సంజయ్ వాట్సప్ కు ఈ పేపర్ షేర్ అయినట్టు ప్రత్యేకంగా వెల్లడించారు. సీపీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అయన్ని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి తరలించడం చర్చకు దారి తీస్తోంది.
రంగంలోకి లీగల్ టీం
మంగళవారం అర్థరాత్రి బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన విషయంలో బీజేపీ లీగల్ టీం ఎంట్రీ ఇవ్వనుంది. హైదరాబాద్ నుండి బయలుదేరిన లీగల్ టీమ్ బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు వెల్లి న్యాపరంగా కూడా ఎదుర్కొనేందుకు సిద్దం కానున్నట్టు సమాచారం. అయితే బండి సంజయ్ ని ముందస్తు అరెస్టులో భాగంగా కస్టడీలోకి తీసుకున్నారా లేక కేసు నమోదు చేసి తీసుకున్నారా అన్న విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు.