దిశ దశ, హైదరాబాద్:
హైదరాబాద్ పాత బస్తీలో బీజేపీ పాగా వేసే ఎత్తులకు శ్రీకారం చుట్టింది. పార్టీ సభ్యత్వ సేకరణలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇచ్చిన పిలుపు ఓల్డ్ సిటీపై తమ టార్గెట్ గురించి చెప్పకనే చెప్పినట్టయింది. హైదరాబాద్ లో జరిగిన సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో భాగంగా సంజయ్ మాట్లాడుతూ… పాత బస్తీలో లక్ష సభ్యత్వాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఓల్డ్ సిటీలో పాగా వేసిన ఎంఐఎంకు ధీటుగా కార్యక్రమాలు నిర్వహించడం బండి సంజయ్ ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్రను కూడా ఇక్కడి భాగ్యలక్ష్మీ ఆలయం నుండే ప్రారంభించారు. కాషాయం ఊసేలేని పాత బస్తీలో బండి సంజయ్ చేపట్టిన కార్యక్రమాలతో బీజం వేసినట్టయింది. దీంతో అక్కడ బీజేపీ పాగా వేయాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు బండి సంజయ్. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పలు కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఇచ్చిన పిలుపు సంచలనంగా మారింది. ఓల్డ్ సిటీలో లక్ష సభ్యత్వాలను సేకరించేందుకు నడుం బిగించాలని క్యాడర్ కు పిలునివ్వడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. లోకసభ ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టిన బీజేపీ సాహసం చేస్తోందన్న వాదనలు వినిపించాయి. అయితే ఇక్కడి ఓటర్లు బీజేపీని అంతగా ఆదరించకపోయినప్పటికీ వెనకడుగు వేయకుండా సభ్యత్వ సేకరణతో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తే పాతబస్తీలో బీజేపీ క్షేత్ర స్థాయి నిర్మాణం కోసం వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. సభ్యత్వ సేకరణ లక్ష్యం మేరకు సాగితే రానున్న ఎన్నికల్లో పార్టీ ఓల్డ్ సిటీలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
77 లక్షలు…
మరోవైపున లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకున్నారు. 77 లక్షల ఓట్లు బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నేపథ్యంలో ఈ ఓటర్లందరికి పార్టీ సభ్యత్వం ఇచ్చినట్టయితే రాష్ట్రంలో కూడా బీజేపీ బలమైన పార్టీగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే బండి సంజయ్ ఆ ఓటర్లందరిని పార్టీ సభ్యులుగా మల్చుకునేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ సేకరణే లక్ష్యంగా తెలంగాణాలో పకడ్భందీగా నిర్మాణం చేసే దిశగా ముందుకు సాగాలని కమలనాథులు భావిస్తున్నట్టుగా అర్థం అవుతోంది.