దిశ దశ, కరీంనగర్:
జెన్ కోలో అడ్డదారి గుండా ఉద్యోగం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ సరిత విషయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. బుధవారం కరీంగనర్ లో వాకర్స్ తో పొన్నం ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు సరితకు ఉద్యోగం ఇప్పించిన విషయంలో ఏ మాత్రం సంబంధం లేనట్టయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. వినోద్ కుమార్ తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించి ఫిర్యాదు చేసినట్టయితే పోలీసుల విచారణలో కూడా వాస్తవాలు వెలుగు చూస్తాయని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చిత్తశుద్దిని కూడా నిరూపించుకునట్టు అవుతుందన్నారు. జెన్ కో తో పాటు ఇతర ప్రభత్వ విభాగాల్లో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే వారంతా తమ ఉద్యోగాలు వదులు కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ చేపట్టడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో దడ మొదలైందన్న పొన్నం ప్రభాకర్ రూ. లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు 9 నెలలు కూడా సేవలందించలేకపోయిందని విమర్శించారు. కాళేశ్వరం విచారణను స్వాగతించి అందుకు అనుగుణంగా రికార్డులు అందించాలని కోరారు. ఈ నిర్మాణాలకు సంబంధించిన అవకతవకులు ఉన్నట్టయితే విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని పొన్నం కోరారు. ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపిస్తామని చెప్పామని అదే విధంగా ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ విచారణకు లేఖ కూడా రాసిందని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడేందుకు బీజెపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టుగా తాము వ్యవహరించడం లేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ బినామీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లనుండి అధికారంలో ఉన్నారని ఇంతకాలం ఏం చేశారంటూ ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ను రక్షించే విధంగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే విచారణకు ఆదేశించామంటేనే మా చిత్తశుద్ది చేతల్లో చూపిస్తున్నామని గమనించాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే గ్యారెంటీ స్కీమ్ లపై ధరఖాస్తులు స్వీకరించామన్న విషయాన్ని గమనించాలని, ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసి తీరుతామని వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన భూ అక్రమాలపై కూడా చర్యలు చేపడ్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన అక్రమాలన్ని తెలుసని, ఇసుక దందాలు కూడా జరిగియాని, పోలీసులను అడ్డుపెట్టుకుని వ్యవహరించారని వ్యాఖ్యానించిన ఆయన బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేందుకు తాము కూడా చొరవ తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.