‘మిషన్ నార్త్‌ఈస్ట్’ పేరిట ఈశాన్య రాష్ట్రాల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ కి నూతనోత్తేజం లభించింది. ఈశాన్య భారతంలో కమలం వికసించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. త్రిపురలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ దక్కింది. 60 స్థానాలకు గాను సొంతంగా 32 స్థానాలు గెలుకొని, ఒక్కే ఒక్క స్థానంలో నెగ్గిన మిత్రపక్షం ఐపీఎఫ్‌టీతో కలిసి వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలుండగా, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ)–బీజేపీ కూటమి 37 స్థానాల్లో పాగా వేసింది. ఎన్‌డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు లభించాయి. రెండు పార్టీలు కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. 60 స్థానాలున్న మేఘాలయాలో ఒంటరిగా పోటీకి దిగి, కేవలం 2 సీట్లే గెలుచుకున్న బీజేపీ కింగ్‌మేకర్‌గా అవతరిస్తుండడం గమనార్హం. 26 సీట్లలో నెగ్గిన అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వంలో బీజేపీ మళ్లీ జూనియర్ భాగస్వామిగా చేరినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. నాగాలాండ్‌లో 5, త్రిపురలో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ మేఘాలయాలో సున్నా చుట్టేసింది. త్రిపురలో కొత్త పార్టీ తిప్రా మోథా ఏకంగా 13 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఎన్నికల్లో బీజేపీ స్థిరంగా విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ పనితీరు పట్ల కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. బీజేపీ గెలుపునకు గాను క్రెడిట్ మొత్తం ‘త్రివేణి’కే ఇవ్వాలన్నారు.
బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ఆయా ప్రభుత్వాల పని సంస్కృతి, పార్టీ కార్యకర్తల అంకితభావం వల్లే విజయాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈశాన్య ప్రాంతం ఢిల్లీకి, దిల్(హృదయం)కి ఎక్కువ దూరంలో లేదన్న సంగతి ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందన్నారు. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమి మళ్లీ అధికారం దక్కించుకోవడం పార్టీ కార్యకర్తలందరికీ గర్వకారణమని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మర్ జా మోదీ(చనిపో మోదీ) అని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, ప్రజలు మాత్రం మత్ జా మోదీ(వెళ్లొద్దు మోదీ) అని నినదిస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు.
Disha Dasha
1884 posts
Prev Post