అసెంబ్లీలో ఆ పార్టీ పరిస్థితి ఏంటీ..? డబుల్ ‘ఆర్’ లేదా ట్రిపుల్ ‘ఆరా’ అన్నది అంతుచిక్కకుండా పోయింది. ఒక్క ఆర్ తో మొదట సరిపెట్టుకున్న ఆ పార్టీ మరో రెండు ఆర్ లతో ట్రిపుల్ ఆర్ అని చెప్పుకుంది. కానీ ఇప్పుడు మొదటి ఆర్ తమతో పాటు ఉన్నట్టా లేదా అనే విషయం అర్థం కాకుండా పోయింది. ఈ విషయంలో ఆ పార్టీ పరిస్థితి ఎలా తయారైందంటే ఆ ‘ఆర్’ను వదులకుంటే జనాలు ఊరుకునేలా లేరు… వదులుకోకపోతే అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించినట్టవుతుంది… అన్నతర్జన భర్జనలో కొట్టుమిట్టాడుతోంది. ఇంతకీ ఆర్ కథ ఏంటటే..?
పెరిగిన బలం… తగ్గిన వైనం…
2018 ఎన్నికల్లో బీజేపీ ముఖ్య నాయకులు కూడా ఓటమి చెందినప్పటికీ రాజాసింగ్ మాత్రమే గెలిచారు. ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక నుండి రఘునందన్ రావు, హుజురాబాద్ నుండి ఈటల రాజేందర్ గెలిచారు. గత సంవత్సరం హుజురాబాద్ కు జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ కు మధ్య నెలకొన్న అంతరం కారణంగా ఆయన టీఆరెఎస్ పార్టీని వీడాల్సి వచ్చింది. క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఈటల బర్తరఫ్ తో ఆయన రాజీనామా చేసి బీజేపీ నుండి బరిలో నిలిచారు. అప్పటికే రాష్ట్ర అసెంబ్లీకి రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచారు. హుజురాబాద్ బై పోల్స్ లో రాజేందర్ కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడ్తాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప ఎన్నికల సమయంలో జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా బండి సంజయ్ అసెంబ్లీలో బీజేపీ సభ్యులు ట్రిపుల్ ‘ఆర్’ అవుతారని కూడా వ్యాఖ్యనించారు. హుజురాబాద్ బై పోల్స్ లో ఈటల కూడా గెలవడంతో రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్ (ట్రిపుల్ ఆర్) అంటూ బీజేపీ చెప్పుకుంది. అయితే అనూహ్యంగా బీజేపీ నుండి రాజాసింగ్ సస్పెన్షన్ కు గురికావల్సి వచ్చింది. మహ్మద్ ప్రవక్త గురించి రాజాసింగ్ చేసిన కామెంట్లపై అధిష్టానం కూడా సీరియస్ అయి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే సమయంలో రాజా సింగ్ పై ఉన్న కేసుల దృష్ట్యా పోలీసులు రాజాసింగ్ పై పీడీ యాక్టు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతానికి రాజా సింగ్ సస్పెన్షన్ లో ఉండడంతో బీజేపీ సభ్యుడు కాదని తేటతెల్లం అవుతోంది. దీంతో అసెంబ్లీలో బీజేపీ ట్రిపుల్ ఆర్ నుండి డబుల్ ఆర్ కు తగ్గిపోయినట్టయింది. అయితే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అధిష్టానానికి లేఖ రాశారని ప్రచారం జరిగినప్పటికీ క్లారిటీ లేదన్నది వాస్తవం. అయితే రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేయాలని రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. రాజాసింగ్ విషయంలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా సానుకూలత వ్యక్తం అవుతోంది. హిందుత్వ వాదులంతా కూడా రాజాసింగ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేసినప్పటికీ బీజేపీ నాయకత్వం ఆయనకు బాహాటంగా మద్దతు ఇవ్వడం లేదు.
మిస్సయిన మరో ‘ఆర్’…
అయితే రాష్ట్రంలో ‘ఆర్ ’ తో మొదలై ట్రిపుల్ ఆర్ వరకూ చేరుకుని తిరిగి డబుల్ ఆర్ కు పరిమితం అయిన బీజేపీ తాజాగా జరిగిన మరో ఎన్నికతో మళ్లీ ట్రిపుల్ ఆర్ కు చేరుకుంటామని భావించినప్పటికీ మిస్సయిపోయింది. మునుగోడు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన క్రమంలో శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి గెలుపుతో అసెంబ్లీలో మళ్లీ ట్రిపుల్ ఆర్ గా బీజేపీ మారుతుందన్న అంచనాలు తల కిందులయ్యాయి. ప్రభాకరుని చేతిలో రాజగోపాలుడు ఓటమి పాలు కాక తప్పలేదు దీంతో బీజేపీ అసెంబ్లీలో డబుల్ ‘ఆర్’ కే పరిమితం కావల్సి వచ్చింది.
సింగ్ పై నిర్ణయం ఏంటో.. ?
అయితే ఇదే సమయంలో రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్న చర్చ సాగుతోంది. ఆయనకు అండగా నిలుస్తుందా లేక అతన్ని అలాగే వదిలేస్తుందా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. రాజాసింగ్ కు అనుకూలంగా ఉన్నట్టయితే బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేయడం తప్పని ఒప్పకున్నట్టు అవుతుందని, తీసుకోకపోతే ధర్మం కోసం చేస్తున్నపోరాటం ఇదేనా అన్న ప్రశ్న హిందూ సమాజం నుండి ఎదురయ్యే పరిస్థితి ఎదురుకానుంది. ఏది ఏమైనా రాజాసింగ్ విషయంలో బీజేపీ తీసుకునే నిర్ణయం మాత్రం ఆ పార్టీ పరిస్థితి సంకటంగా మారిందని చెప్పవచ్చు.