కేసీఆర్ ఇంటివద్ద పూజలు చేసిన బొమ్మ కలకలం
దిశ దశ, హైదరాబాద్:
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం వద్ద క్షుద్ర పూజల కలకలం లేపింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నందినగర్ లోని కేసీఆర్ ఇంటి సమీపంలో పూజలు చేసిన ఓ బొమ్మతో పాటు నిమ్మకాలు, ఎర్రని గుడ్డతో కట్టిన మూట ఆ ప్రాంతంలో పడేసి ఉన్నాయి. సోమవారం అర్థరాత్రి సమయంలో వీటిని పడేసి ఉంటారని స్థానికులు చర్చికోవడంతో క్షుద్ర పూజలు చేశారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. జన సంచారం ఉండే ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు చేయడం ఏంటీ..? అసలు అక్కడే ఎవరు పడేశారు అన్న అనుమానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత కేసీఆర్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు నందినగర్ నివాసంలోనే ఉంటున్నారు. ఈ ఇంటి వద్దే క్షుద్ర పూజలు చేసిన ఓ బొమ్మ పడేసి ఉండడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తం అయింది. మూడ నమ్మకంతో స్థానికులే ఎవరైనా అక్కడ వీటిని పడేసి ఉంటారేమోనన్న ప్రచారం కూడా జరిగినప్పటికీ దాని అసలు విషయం మాత్రం వెలుగులోకి రాలేదు. బొమ్మకు తలవైపున గుమ్మడికాయ ముక్క, బొమ్మపైన అల్యూమినియంతో అల్లిన తీగలు మరో పక్కన ఎర్ర బట్టలోపలో ఏవో వస్తువులు పెట్టి ముడివేసి పెట్టారు. దీంతో తాంత్రిక పూజలకు సంబంధించిన వారెవరో ఈ ప్రాంతంలో సంచరించి ఉంటారని కూడా స్థానికులు అనుమానిస్తున్నారు. లేనట్టయితే తాంత్రిక పూజలు చేసే వారు క్షుద్ర పూజలు చేసిన బొమ్మ, ఇతర వస్తువులను ఎవరికైనా అప్పగించి ఉంటారని వాటిని గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో పడేసి ఉంటారన్న అనుమానాలు కూడా వచ్చాయి. అయితే ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోనే ఇలా జరగడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది.
రీల్స్ అంటూ…
మరో వైపున ఈ జనరేషన్ కు చెందిన చాలా మంది కూడా రీల్స్ మోజులో పడిపోతున్న సంగతి తెలిసిందే. స్థానికంగా ఉన్న కొంతమంది రీల్స్ కోసం వాటిని అక్కడ వేశారని, ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు రీల్స్ కోసమే వీటిని అక్కడ ఉంచామని చెప్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే రీల్స్ కోసమే అయితే ఇంత రచ్చ జరగాల్సిన అవసరం ఉండదు కదా అని అంటున్న వారూ లేకపోలేదు. రీల్స్ చేసినట్టయితే వారు వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు స్థానికులు గుర్తించే అవకాశం కూడా ఉంటుంది కదా అని కొందరు అంటున్నారు. ఏదీ ఏమైనా ఎక్కడో మారుమాల ప్రాంతాల్లో కొనసాగే తాంత్రిక పూజలు, క్షుద్ర పూజల కలకలం హైదరాబాద్ మహానగారాన్ని కూడా పట్టి కుదిపేస్తుండడం సంచలనంగా మారింది.