CRIME: పాతి పెట్టిన శవం… కనిపించని కుటుంబం…

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం

దిశ దశ, వరంగల్:

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్స్ కాలనీలో ఓ మహిళ మృతదేహం పాతిపెట్టి ఉండడం సంచలనంగా మారింది. అయితే ఆ ఇంట్లో ఉండాల్సిన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో అసలేం జరిగింది అన్న విషయంపై స్ఫష్టత రాకున్నప్పటికీ… ఆమెను హత్య చేసి చంపి పాతిపెట్టి కుటుంబ సభ్యులు పరార్ అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏం జరిగిందో..?

పట్టణంలోని సిగ్నల్స్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబం స్థానికంగా ఉపాధి కోసం రైల్వై ట్రాక్ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుంటూ జీవనం సాగిస్తోందని స్థానికులు చెప్తున్నారు. ఈ కుటుంబానికి చెందిన గోపి కొద్ది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలుస్తోంది. నాలుగేళ్ళుగా సిగ్నల్స్ కాలనీలోని వివిధ ఇండ్లలో నివాసం ఉంటూ ఇటీవలే భూపతి అంజయ్య ఇంట్లోకి షిప్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కుటుంబంలో తరుచూ గొడవలు అవుతుండేవని స్థానికులు చెప్తున్నారు. వేకువ జామునే చీకటి పడే వరకూ రైల్వై ట్రాక్ పరిసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుని ఇంటికి చేరుకునే వారని అంటున్నారు. దీంతో వీరు ఇరుగుపొరుగు వారితో కూడా అంతగా సాన్నిహిత్యంగా కూడా లేరని సమాచారం. కానీ రోజూ ఆ ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో అరుపులు వినిపిస్తుండేవని కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే మంగళవారం నుండి గోపి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోగా, ఇంటీ ఆవరణలో ఓ చోట భూమిని తవ్వినట్టుగా కనిపించింది. దీంతో ఇరుగు పొరుగు వారు ఇంటి యజమానికి సమాచారం ఇవ్వడంతో ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెల్లిన అంజయ్య ఇంటికి చేరుకున్నారు. ఇంటి ఆవరణలోని కట్టెల పొయ్యి పక్కన భూమిని తవ్వుతుండగా శవం ఆనవాళ్లు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహబూబాబాద్ పోలీసు యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తోంది.

కల్లాపి చల్లి…

అయితే గోపి భార్య శవాన్ని అక్కడ పాతిపెట్టారని పట్టణంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే గోపి కుటంబ సభ్యులు శవం లభ్యమైన చోట ప్రత్యేకంగా కల్లాపి చల్లినట్టుగా స్థానికులు గుర్తించారు. అదే చోట తవ్వడంతో శవం బయటకు వచ్చింది. దీంతో గోపితో పాటు అతని కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేసి అక్కడ పాతి పెట్టి పరార్ అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గోపి ఫ్యామిలీ అందుబాటులో లేకపోవడంతో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావడం లేదు. శవాన్ని పోస్టు మార్టం చేసినట్టయితే హత్యకు గురైందా..? ఎప్పుడు చనిపోయి ఉంటుంది అన్న విషయాలపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే స్థానికులు మాత్రం ఇంటి కోడలిని గోపీ కుటుంబ సభ్యులంతా కూడా హింసించే వారని చర్చించుకుంటున్నారు. ఆమెను తరుచూ వేధింపులకు గురి చేసేవారని, ఆ కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా గోపి భార్యను దారుణంగా చూసేవారని అంటున్నారు. స్థానికంగా ఉన్న ప్రచారాన్ని బట్టి అయితే మాత్రం ఆమెను హత్య చేసి ఉంటారన్నట్టుగానే అనిపిస్తోంది. ఇదే కుటుంబానికి చెందిన వేరే ఫ్యామిలీకి చెందిన వారు కూడా హత్య చేసి పాతిపెట్టి ఫరార్ అయ్యారని స్థానికులతో చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది.

You cannot copy content of this page