BIG BREAKING: బీజేపీలో చేరిన బోగ శ్రావణి

అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల మహిళా నాయకురాలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం న్యూ ఢిల్లీలో కాషాయం కండువా కప్పుకున్నారు. జగిత్యాల మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి, ఆమె భర్త డాక్టర్ బోగ ప్రవీణ్ లు న్యూ ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో వీరు బీజేపీ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపి ధర్మపురి అరవింద్, మాజీ ఎంపి గడ్డం వివేక్, మాజీ మంత్రి డికె అరుణలు కూడా పాల్గొన్నారు.



ఆ హామీ వచ్చిందా..?

బోగ శ్రావణి ఎట్టకేలకు బీజేపీలో చేరడంతో ఆమె ఏ పార్టీలో జాయిన్ అవుతారోనన్న చర్చ సాగింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో విబేధించి పార్టీని వీడిన శ్రావణి మునిసిపల్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు డాక్టర్ సంజయ్ లక్ష్యంగా పలు విమర్శలు చేస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీలోనే కొనసాగుతానని బీఆర్ఎస్ ను వీడేది లేదని శ్రావణి ప్రకటించినప్పటికీ ఆమె వేరే పార్టీలోకి చేరేందుకు నిర్ణయం తీసేసుకున్నారన్న ప్రచారం జరిగింది. అప్పటికే ఎంపీ ధర్మపురి అరవింద్ తో టచ్ లో ఉన్నారన్న ప్రచారం కూడా జరగినప్పటికీ శ్రావణీ వర్గం కొట్టిపడేసింది. పదవికి రాజీనామా చేసిన తరువాత నియోజకవర్గంలో కలియ తిరుగుతూ ప్రజలతో మమేకం అయ్యే పనిలో పడ్డారు. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం కాషాయం కండువా కప్పుకున్న శ్రావణికి బీజేపీ అధిష్టానం ఆ హామీ ఇఛ్చిందా అన్న విషయం తేలాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో శ్రావణి జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో శ్రావణికే టికెట్ ఇస్తానని బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చిందా లేదా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన పద్మశాలి బిడ్డ శ్రావణి బరిలో నిలిస్తే గెలిచే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం కూడా గుర్తించినట్టుగా సమాచారం. ఈ విషయం అంతా కూడా అధిష్టానానికి చెప్పిన ఎంపీ అరవింద్ ఆమెను పార్టీలో జాయిన్ చేసుకునేందుకు ప్రయత్నించి సఫలం అయ్యారు. జగిత్యాలలో కూడా బలమైన నేత కోసం అధిష్టానం అన్వేషిస్తున్న క్రమంలో బోగ శ్రావణి చేరిక కూడా బీజేపీకి ప్లస్ అయిందని చెప్పక తప్పదు.

You cannot copy content of this page