బాలీవుడ్ అగ్రనటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇవాళ నటుల నివాసానికి ఈ బెదిరింపులు వచ్చాయి. అమితాబ్, ధర్మేంద్ర నివాసాల వద్ద బాంబులు పెట్టామంటూ ఉదయం నాగపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అధికారులు.. ఫోన్ కాల్ ఆధారంగా నిందితుల ఆచూకి తెలుసుకునే పనిలో పడ్డారు. మరోవైపు తీవ్రవాద దాడి కోసం మారణాయుధాలతో 25 మంది.. ముంబైలోని దాదార్‌కు చేరుకున్నారని సైతం అగంతకులు బెదిరించారు. జుహు, విల్లే పార్లే, గామ్ దేవిలలో, అలాగే నటుల నివాసాలలోను అప్రమత్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబైలో అమితాబ్ బచ్చన్ కు ఐదు లగ్జరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అతని ఇళ్ల పేరు జల్సా, జనక్, వత్స, ప్రతీక్ష. ముంబైలో అమితాబ్ కొన్న మొట్టమొదటి ప్రాపర్టీ ప్రతీక్ష. అమితాబ్ తల్లిదండ్రులు ఇందులోనే నివసించారు. ప్రస్తుతం వీరు జల్సాలో జీవిస్తున్నారు. ఇక ధర్మేంద్ర జుహులో ఉంటున్నారు.
మరోవైపు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసానికి సైతం పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. తాజాగా వచ్చిన బెదిరింపు కాల్ జాబితాలో అంబానీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబానీ ఫ్యామిలీకి ముంబై, దేశంతో పాటు దేశ విదేశాల్లోనూ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీముఖేష్ భరిస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖేష్ అంబానీ భారత్‌లో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పిస్తుందని.. విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లను కల్పించాలని సూచించింది.