నిన్న టీపీసీసీ చీఫ్ నేడు ఏఐసీసీ చీఫ్

టికెట్ ప్రయత్నాల్లో బొమ్మకల్ శ్రీనివాస్..?

దిశ దశ, కరీంనగర్:

బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ ఢిల్లీ కేంద్రంగా జరుపుతున్న మంత్రాంగం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత దూకుడు పెంచినట్టుగా కనిపిస్తోంది. ఢిల్లీలో ఉన్న పురుమళ్ల శ్రీనివాస్ శనివారం టీపీసీసీ చీఫ్ ఎ రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలవడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. కరీంనగర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న శ్రీనివాస్ అటు టీపీసీసీ, ఇటు ఏఐసీసీ ముఖ్య నాయకులను కలివడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. కరీంనగర్ నుండి చాలా మంది టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఢిల్లీ స్థాయిలో తిరుగుతూ మంత్రాంగం చేస్తున్న వారు చాలా తక్కువేనని చెప్పాలి. ఒకరిద్దరు ఆశావాహులు తమ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి వివరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మిగతా నాయకులంతా కూడా టీపీసీసీ నేతలనే నమ్ముకున్నారు. కానీ బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్ మాత్రం ఏఐసీసీ లెవల్లో పావులు కదుపుతూ తన టికెట్ కోసం ప్రయత్నిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన వారం రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అతి ముఖ్యనేతల అపాయింట్ మెంట్ దొరకడం గమనార్హం. ఇంతకాలం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి పేర్లలో అట్టడుగున ఉన్న పురుమళ్ల శ్రీనివాస్ ఢిల్లీలో గత రెండు మూడు రోజులుగా నెరుపుతున్న సమీకరణాలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page