ఢిల్లీలో ప్రత్యేక భేటీ
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ శనివారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గత నెలలోనే దరఖాస్తు చేసుకున్న ఆయన బీఆర్ఎస్ పార్టీతోని అంటిముట్టకుండ ఉంటు ఈ నెల 15న అధికారికంగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పురమళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరే లాంఛనం మిగిలిపోయింది. దీంతో రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెల్లిన శ్రీనివాస్ శనివారం ఉదయం టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ ఎ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో నెలకొన్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులు గురించి శ్రీనివాస్ రేవంత్ రెడ్డికి వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే కరీంనగర్ టికెట్ కోసం తాను దరఖాస్తు చేసుకున్న విషయం వివరించడంతో పాటు ఇక్కడి సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి, తనకు అవకాశం ఇస్తే ఎలాంటి సానుకూలత ఉంటుంది అన్న విషయాన్ని రేవంత్ రెడ్డికి తెలియజేసినట్టుగా తెలిసింది. బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండడంతో పాటు మైనార్టీలు, అగ్రవర్ణ సామాజిక వర్గాలకు చెందిన వారు తనకు ఖచ్చితంగా మద్దతు ఇస్తారని వివరించినట్టు సమాచారం. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే ఇక్కడి సమీకరణాలన్నింటిని తనకు అనుకూలంగా మల్చుకుని గెలిచి తీరుతానని కూడా రేవంత్ రెడ్డికి వివరించినట్టు తెలిసింది. అయితే రేవంత్ రెడ్డిని పురుమళ్ల టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిని హైదరబాద్ లో కలవకుండా ఢిల్లీలో ప్రత్యేకంగా కలవడం వెనక కారణమేంటన్న చర్చ మొదలైంది.