దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:
2018 ఎన్నికల్లో ప్రత్యక్ష్య ఎన్నికల్లో తలపడ్డ నేతలే మళ్లీ బరిలో నిలుస్తున్నారు. కాకపోతే పార్టీలు మారిన ఆ నేతలు ఇద్దరు కూడా కొత్త గుర్తుల గురించి ప్రచారం చేసుకోబోతున్నారు. రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉన్న నియోజకవర్గాల్లో హుజురాబాద్ కు ఉన్న స్పెషాలిటీ అంతా ఇంతా కాదు. వైవిద్యమైన రాజకీయాలతో చర్చల్లో నిలిచే ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో వైవిద్యత చోటు చేసుకుందనే చెప్పాలి.
పాత ప్రత్యర్థులే…
హుజురాబాద్ నుండి ఈసారి తలపడబోతున్న ఇద్దరు అభ్యర్థులు కూడా గత ఎన్నికల్లో కూడా పోటీ పడినవారే కావడం విశేషం. అయితే అప్పుడు వేరే పార్టీల తరుపున బరిలో నిలిచిన ఈ ఇద్దరు నాయకులు కూడా ఈ ఎన్నికల్లో మాత్రం కొత్త పార్టీల తరుపున ప్రజా క్షేత్రంలోకి వెల్తున్నారు. గత ఎన్నికల్లో ఇద్దరి మధ్య మాటల యుద్దం చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. తలపండిన నేతపై కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన యువకుడు చేసిన విమర్శలు అప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా కూడా వీరిద్దరే ప్రధాన పార్టీల నుండి తలపడుతున్నారు. అప్పటి ఎన్నికల్లో కారు గుర్తుపై ఈటల రాజేందర్ బరిలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఇప్పుడా పరిస్థితులకు చెక్ పడినట్టయిపోయింది. అప్పుడు కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించిన ఈటల రాజేందర్ ఇప్పుడు కమలం గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను కోరుతున్నారు. అప్పుడు చేయి గుర్తుకు ఓటేయండంటూ కోరిన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించనున్నారు.
ఐదేళ్లలోనే…
కేవలం ఐదేళ్లలో హుజురాబాద్ లో మారిన రాజకీయాలు సంచలనమేనని చెప్పాలి. ఉద్యమ పార్టీలో కొనసాగి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం, ఆయనపై కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం జరిగిపోయింది. ఉద్యమనేత కేసీఆర్ తో అత్యంత సాన్నిహిత్యం ఉన్న నాయకుల్లో ఒకరైన ఈటల రాజేందర్ అనూహ్యంగా గులాభి కండువా వదిలేయాల్సి రావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ క్రమంలో హుజురాబాద్ లో ఉప ఎన్నికలు జరగగా ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కానీ కౌశిక్ రెడ్డి ఉప ఎన్నికలకు ముందు గులాభి కండువా కప్పుకున్నప్పటికీ ఆయనకు బదులుగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు. గత జనరల్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న ఈటల రాజేందర్ ఈ సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే, నాడు కాంగ్రెస్ అభ్యర్థి అయిన కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల నాటి ప్రత్యర్ధులే మరోసారి తలపడబోతున్నప్పటికీ ఇద్దరు కూడా పార్టీలు మారడమే స్పెషాలిటీ.