మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ ప్రకటన
దిశ దశ, దండకారణ్యం:
ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ ఓ ప్రకటన జారీ చేసింది. బూటకపు ఎన్నికలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదంటూ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రత్యక్ష్య పోరు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ సంస్థాగత నిర్మాణ బలం లేకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ తో అంతర్గత పొత్తు కొనసాగిస్తోందని మావోయిస్టు పార్టీ పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు అవసరమని భావించే బీజేపీతో చేతులు కలుపిందని, ఓట్ల కోసం వచ్చే రాజకీయ పార్టీలను తన్ని తరిమేయాలని పిలుపునిచ్చింది. అభివృద్ది నిరోధక పార్టీలయిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తన్ని తరిమేసి, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలను నిలదీయాలని మావోయిస్టు పార్టీ అభ్యర్థించింది. ఒక బూర్జువా ప్రభుత్వంలో మరో బూర్జువా పార్టీని అధికారంలోకి తీసుకరావడమే పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని, ఇది ప్రత్యామ్నాయ రాజకీయ అధికారం అసలే కాదని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. స్వాతంత్ర్య, సమానత్వం, శాంతి, సౌభ్రాతృత్వం, శ్రమ సూత్రాలపై ఆధారపడి నూతన సమాజం ఏర్పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇందు కోసం అన్ని ప్రగతి శీల సామాజిక శక్తుల సహకారంతో కార్మికవర్గం సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఫాసిస్టు విధానాలు అవలంబిస్తున్నామని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.