దిశ దశ, స్పెషల్ కరస్పాండెంట్:
శతాబ్ద కాలం క్రితమే పుట్టిన ఆ పార్టీ చరిత గురించి దశాబ్దాల వయసులో ఉన్న నేతలు ఢంకా బజాయించి చెప్తున్నా పార్టీతోనే అనుబంధం పెనవేసుకున్న వీరి గురించి తెలుసా..? గాంధీ కుటుంబం గురించి కీర్తించే నేటి తరం నేతలకు వీరి చరిత తెలుసా..? మూడు రంగుల కండువా కప్పుకుని తమ పార్టీ గొప్పతనాన్ని కీర్తించుకుంటూ ప్రసంగాలు చేసే నేటితరపు నేతలు చరిత లోతుల్లోకి తొంగి చూశారా..? కాంగ్రెస్ పార్టీ అంటేనే గాంధీ కుటుంబం అంటూ గొప్పలు చెప్పే నాయకులు… భావావేషపు ప్రసంగాలు చేస్తూ కాలం వెల్ల దీయడానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ ఆ పార్టీ వైభవానికి ప్రతీకలుగా కొంతమంది ఉన్నారన్న నిజం గుర్తెరిగారా..? సముద్రంలాంటిది తమ పార్టీ అని చెప్తున్న ఆ పార్టీ నాయకులు ఆ సముద్ర గర్భంలో దాగిన చారిత్రాత్మక నేపథ్యం గురించి ఆరా తీసే ప్రయత్నం చేశారా..?
కాంగ్రెస్ పార్టీ… ?
1885లో పుట్టిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బానిస సంకెళ్ల విముక్తి కోసం పోరాటం చేయడంలో కీలక భూమిక పోషించింది. మహాత్మా గాంధీ, జవహార్ లాల్ నెహ్రూలాంటి యోధానయోధులు ఇచ్చిన పిలుపు మేరకు జాతీయోద్యమంలో నాటి యువత కదం తొక్కి నడిచింది. భారతావని అంతా బ్రిటష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే… హైదరాబాద్ స్టేట్ లో మాత్రం నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా గళమెత్తింది. సాయుధ పోరాటమే ఊపిరిగా కొందరు ముందుకు సాగితే శాంతియుత పోరాటం వైపు సాగారు మరికొందరు. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు చేసిన పోరాటం అనన్య సామాన్యమనే చెప్పాలి. ఎర్ర జెండా నీడన పోరుబాట పట్టిన వారెందరో జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమంది బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నా వారిని పట్టించుకున్న వారే లేరు. కమ్యూనిస్టు యోధుల చరిత ఎర్ర సిరాతో సువర్ణాక్షరాలతో లిఖించినా కాంగ్రెస్ జెండా ఎత్తుకున్న వారిని ఏరిపారేసిన పరిస్థితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అత్యంత కీలక భూమిక పోషించిన ఆ యోధుల గురించి స్మరించుకున్న వారే లేరన్నది వాస్తవం. ఇంకా చెప్పాలంటే ఈ తరం నేతలకు కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్లుగా కొందరు ఉన్నారన్న విషయం తెలియదంటే కూడా అతిశయోక్తి కాదేమో. ‘దిశ దశ’ నేటి తరానికి గత కాలపు చరిత్రను అందించాలని చేస్తున్న చిన్న ప్రయత్నమే ఇది.
వారి ఇంటి పేరే కాంగ్రెస్…
సాధారణంగా పూర్వీకుల నుండి సంక్రమించే ఇంటి పేరే చాలా మందికి ఉంటుంది. కానీ అక్కడ కాంగ్రెస్ అనే ఇంటి పేరుతోనే కొంతమంది బ్రాండ్ అంసిడర్లుగా మారిపోయారు. నెహ్రూ కుటుంబాన్ని సైతం గాంధీ కుటుంబమనే పిలుస్తారు కానీ వారి ఇంటిపేరు మాత్రం కాంగ్రెస్ అని మారలేదు. అయితే గోదావరి తీర ప్రాంతంలో నిజాం విముక్తి కోసం పోరుబాట చేసిన వారి ఇంటి పేరు మాత్రం కాంగ్రెస్ అని మారడం విశేషం. మహారాష్టలోని విదర్భ ప్రాంతంలోని చాందా(చంద్రపూర్) క్యాంపులో సాయుధ శిక్షణ పొంది నిజాం వ్యతిరేక పోరాటం చేసిన వారి గురించి బహుష చాలా తక్కువ మందికే తెలుసు కావచ్చు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన రామన్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ సమీపంలోని బొమ్మాపూర్ శివారు ప్రాంతానికి చెందిన మల్లయ్య, మహదేవపూర్ కు చెందిన శంకరయ్యల ఇంటిపేర్లే కాంగ్రెస్ గా మారిపోయాయి. వీరిని కాంగ్రెస్ రామన్న, కాంగ్రెస్ మల్లయ్య, కాంగ్రెస్ శంకరయ్య అని ఆ తరం వారు పిలిచేవారు. వారి ఇంటి అడ్రస్ అడగినప్పుడు వారి సొంత ఇంటి పేరు చెప్పి ఆరా తీస్తే మాత్రం మాకు తెలియదనే సమాధానం వచ్చేది. కానీ వారి పేర్లకు ముందు కాంగ్రెస్ అని జోడిస్తే మాత్రం ఠక్కున చెప్పేసేవారు. అంతటి బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారంటే వీరికి ఆ పార్టీకి ఎలాంటి అనుభందం పెనవేసుకుందో అర్థం చేసుకోవచ్చు.