దూకుడు ప్రదర్శిస్తున్న ఎస్ఓటీ
దిశ దశ, హైదరాబాద్:
మహానగరంలో మాయగాల్లు రాజ్యమేలుతున్నారు. నిత్యం జనం రద్దీతి కిక్కిరిసిపోయే గ్రేటర్ లో దందా ఎలా చేసినా చెల్లుతుందని భావించిన ప్రబుద్దులు ఏకంగా బ్రాండ్ క్రియేట్ చేసి మరి గోధుమ పిండి విక్రయానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇందుకు ఉపయోగిస్తున్న గోదుమలు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలకు సబ్సీడీపై అందిస్తోంది అక్కడి ప్రభుత్వం. వీటిని తెలంగాణాకు స్మగ్లింగ్ చేసి ఆటా తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ దాడులు చేసి పట్టుకోవడంతో గుట్టు రట్టయింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… ఉత్తరప్రదేశ్ లోని సిద్దార్థ్ నగర్ కు జిల్లా కోటగ్రాంట్ కు చెందిన ఎండీ సయ్యద్ ఉపాధి కోసం హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లోని సుభాష్ నగర్ కు వలస వచ్చి జీవనం సాగిస్తున్నాడు. 2012లో యూపీ నుండి ఇక్కడకు వచ్చిన సయ్యద్ కొంతకాలం క్రితం వరకు స్క్రాప్ వ్యాపారం చేస్తూ బ్రతికేవాడు. స్నేహితుడు తబిష్ తో కలిసి ఆరు నెలల క్రితం డీకెఎస్ ఫ్లోర్ మిల్ ఏర్పాటు చేసి గోధుమ పిండి అమ్మకాలు ప్రారంభించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై విభాగం ద్వారా అక్కడి పేదలకు సరఫరా చేస్తున్న గోధుమలను ఇక్కడకు స్మగ్లింగ్ చేసి గోదుమ పిండి తయారు చేసే అమ్మడం ప్రారంభించాడు. కృష్ణ, మందిర్ బ్రాండ్ల పేరిట గోధుమ పిండి వ్యాపారం చేపట్టిన విషయం తెలుసుకున్న ఎస్ఓటీ టీమ్ బుధవారం దాడులు చేయడంతో ఎలాంటి అనుమతులు లేకుండానే గోదుమ పిండి విక్రయాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సబ్సీడీ ద్వారా ఇచ్చే గోదుమలు దిగుమతి చేసుకుని దందా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ కేసులో ఎండి సయ్యద్ (24), తబిషీ కబా (24)లను అరెస్ట్ చేయడంతో పాటు 6,200 కిలోల గోదుమలు, 574 కిలోలున్న 35 గోదుమ పిండి బస్తాలు, ఫ్లోర్ మిల్లును స్వాధీనం చేసుకున్నారు. రూ. 16.80 లక్షల విలువైన సామాగ్రితో పాటు నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులకు ఎస్ఓటీ టీమ్ అప్పగించడంతో దర్యాప్తు చేపట్టారు.