Bread Society Services: జన్మభూమిపై మమకారంతో ఏడు పదుల వయసులోనూ ఎన్నారై సేవలు

విద్యార్థుల్లో పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోసం స్పెషల్ ఎఫర్ట్స్…

బ్రీడ్ సంస్థ పేరిట సేవలందిస్తున్న అశోక్ కాచె…

దిశ దశ, మంథని:

నాలుగు దశాబ్దాల క్రితమే వైద్యునిగా పట్టా పొందిన ఆయన విదేశాల్లో స్థిరపడ్డారు. అక్కడే హస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకున్న ఆయన జన్మభూమిపై మమకారంతో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. తను పుట్టి పెరిగిన ప్రాంత బిడ్డలు నిర్మాణాత్మకమైన జీవనంతో ఎదగాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. చదువుల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వడం, వ్యక్తిత్వ వికాసం కోసం చొరవ తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ఇందుకోసం బేసిక్ రిసెర్చ్ ఎడ్యూకేషన్ అండ్ డెవలప్ మెంట్ (బ్రీడ్) సొసైటీని ఏర్పాటు చేసిన ఆ ప్రవాస భారతీయుడు దశాబ్దాల కాలంగా విద్యార్థులను తీర్చిదిద్దే పనిలో నిమగ్నం అయ్యారు.

మంథని వాసి…

పెద్దపల్లి జిల్లా మంథనికి పట్టణానికి చెందిన అశోక్ కాచే 1970వ దశాబ్దంలో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్యశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. అమెరికాలో స్థిరపడిన అశోక్ కాచె మూడు దశాబ్దాలకు పైగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేయడం, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థి దశ నుండి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలపై చిన్నారులకు అవగాహన కల్పించినట్టయితే వారు పటిష్టమైన ఆలోచనా విధానంతో సక్సెస్ అవుతారని భావించిన అశోక్ కాచే ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ముఖ్యంగా 8 నుండి 14 ఏళ్ల వయసులో ఉన్న విద్యార్థుల్లో పర్సనాలిటీ డెవలప్ మెంట్ చేయాలన్న ఆలోచనతో వారి మానసిక స్థితిగతలకు అనుగుణంగా ఉన్న పుస్తకాలను ఈ గ్రంథాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో భారత దేశ చరిత్ర కారుల జీవిత చరిత్ర, పర్యావరణం, నైతిక విలువలు, దేశభక్తికి సంబంధించిన బుక్స్ ను అందుబాటులో ఉంచుతున్నారు. అమెరికాలో కాచె మెడికల్ అండ్ ఎడ్యూకేషన్ సంస్థను ఏర్పాటు చేసిన అశోక్ కాచె ఏపీ, తెలంగాణాల్లో బ్రెడ్ సొసైటీ ద్వారా సేవలందిస్తున్నారు. 74 ఏళ్ల వయుసుకు చేరినా తన ప్రాంతంపై ఉన్న మమకారంతో విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులతో కూడా ప్రత్యేకంగా భేటీ అయి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే 610 ప్రభుత్వ పాఠశాలల్లో బాలల గ్రంథాలయాలు ఏర్పాటు చేసింది ఈ సొసైటి. ఇందులో భాగంగా శనివారం కరీంనగర్ జిల్లా పరిషత్ లో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కాచె, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా విద్యాధికారులు సూర్య జనార్దన్ రావు, మాధవి, బ్రెడ్ సొసైటీ ఉపాధ్యక్షులు విజయ్ సాయి మేఖ, శశి భూషణ్ కాచె, వరహాల శ్రీనివాస్, జిల్లాలోని 80 పాఠశాలలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

You cannot copy content of this page