నిబంధనల బేఖాతరు
ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణం
దిశ దశ, పెద్దపల్లి:
సాధారణంగా నదుల్లో ఇసుక తిన్నెలు, నీటి ప్రవాహాలను మాత్రమే చూస్తుంటాం. కానీ ఈ నది మాత్రం అన్నింటికి భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. సర్కారు అనుమతి ముసుగులో ఆ నదిలో సాగుతున్న నిభందనల పాతర ఎక్కడా కూడా జరగడం లేదమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి సవ్వడుల శబ్దాలను వినడమే మర్చిపోయాయా నది ప్రవాహపు పల్లెలు. ఒకటా రెండా 20కి పైగా వెలసిన ఇసుక రీచులు సహజ వనరుల ఉనికికే సవాల్ విసురుతున్నాయక్కడ.
ఆ ముసుగులో రోడ్లా..?
ర్యాంపు ముసుగులో రీచుల కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. టీఎస్ఎండీసీ ఇచ్చిన అధికారాలను ఆసరగా చేసుకుంటున్నారో లేక అధికార యంత్రాంగం సర్కారుకు రెవెన్యూ ఇస్తున్నామన్న బూచి చూపిస్తున్నారో తెలియదు కానీ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా ఏర్పాటు చేసిన ఇసుక రీచులు మాటున సాగుతున్న తీరు మాత్రం అందరిని విస్మయానికి గురి చేస్తోంది. ఓ వైపున మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎన్జీటీని ఆశ్రయించినా ఇక్కడ మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలంలోని పలు చోట్ల ఏకంగా మానేరు నదిలో రహదారులు నిర్మించడం విస్మయం కల్గిస్తోంది. బండరాళ్లు వేసి మరి తాత్కాలిక రహదారి నిర్మించి రెండు వైపులా ఇసుక వాహనాలను నడిపించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ఎండీసీ నదిలో రీచుకు హద్దులు ఏర్పాటు చేసి అక్కడి నుండి ఇసుకను స్టాక్ యార్డుకు తరలించుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఇందుకోసం రీచు నుండి ఇసుకను రవాణా చేసుకునేందుకు అనువుగా 500 మీటర్ల వరకు తాత్కాలిక రోడ్డు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పెద్దపల్లి జిల్లాలోని గుండ్లపల్లి నుండి చల్లూరు వరకు నదిలోనే ఏకంగా రహదారి నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు మరికొన్ని చోట్ల కూడా నది మధ్య నుండి రోడ్లు వేసుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణ చట్టలేవి..?
అయితే నదిలో ఇలా రహదారులు నిర్మించుకునేందుకు పర్యావరణ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్విరాన్ మెంట్ యాక్టుకు లోబడి వివిధ శాఖల అనుమతులు తీసుకున్న తరువాత రోడ్లే అయినా ఇతరాత్ర నిర్మాణాలే అయినా చేపట్టవచ్చు. కానీ పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఇలాంటి నిబంధనలు అమలు కావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర పర్యావరణ చట్టాలకు లోబడి నదుల్లో పనులు చేపట్టాల్సి ఉంటుంది కానీ ఇక్కడ అలాంటివేవి అమలు కావడం లేదని, పలుకుబడి ఉంటే ఏదైనా సాధ్యమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేర్వేరు గ్రామాలను కలుపుతూ వేసిన రోడ్డు గత నెలలో కురిసిన వర్షాలకు కొట్టుకపోవడంతో మళ్లీ మరమ్మత్తులు చేస్తుండడం గమనార్హం.