మండిపడుతున్న మహిళలు
దిశ దశ, వరంగల్:
శతాబ్దాల నాటి భద్రకాళి చెరువుకు గండి పడింది. వరద నీటి ప్రవాహం తీవ్రం కావడంతో ఒత్తిడికి గురై చెరువు కట్ట తెగిపోవడంతో నీరంతా దిగువ ప్రాంతానికి వెల్లిపోతోంది. పోతన నగర్ వైపు కట్ట కోతకు గురి కావడంతో దిగువన ఉన్న పోతన నగర్, సరస్వతి నగర్ తో పాటు పలు వీధుల్లోకి భద్రకాళి చెరువు నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా కాలనీల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లు ముంపునకు గురువుతాయని కాలనీ వాసులు పెట్టె బేడె సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
రంగంలోకి దిగిన యంత్రాంగం…
భద్రకాళి చెరువు ముంపునకు గురయిన సమచారం అందుకున్న ప్రభుత్వ అధికార యంత్రాంగం గండి పడడడంతో భద్రకాళి చెరువు నీరు వచ్చే అవకాశం ఉన్న కాలనీలకు చేరుకుని నివాసాలను ఖాలీ చేయిస్తున్నారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పోలీసులు కాలనీలకు చేరుకుని తరించే పనిలో నిమగ్నం అయ్యారు.
మహిళల ఆగ్రహం…
భద్రకాళి చెరువుకు గండి పడడం 60 ఏళ్లలో ఇదే మొదటి సారని, చెరువు అప్పటి నుండి ఇదే ప్రాంతంలో నివసిస్తున్న తమ ఇండ్లలోకి ఏనాడు చుక్క నీరు రాలేదని అంటున్నారు. ట్యాంక్ బండ్ చేస్తుండడం వల్లే తమకు ఈ పరిస్థితి దాపురించిందని ఆయా కాలనీలకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఫళంగా తమ ఇండ్లు ఖాలీ చేయించాల్సి రావడానికి కారణం పాలకుల నిర్లక్ష్యమేనంటూ మహిళలు ఆరోపిస్తున్నారు. ఓ వైపున ఇండ్లలోని సామాగ్రిని తరలించేందుకు సమాయత్తం అవుతూనే మరో వైపున మహిళలు శాపనార్థలు పెడుతున్నారు.