దిశ దశ, గోదావరిఖని:
సింగరేణి బొగ్గుగని కార్మికుల్లో తిరుగులేని పట్టు నిలుపుకున్న తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) గుర్తింపు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో కార్మిక నాయకుల్లో నైరాశ్యం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి అనుభంద సంఘంగా ఉన్న టీబీజీకెఎస్ ఏడో దఫా ఎన్నికల్లో పోటీ చేయవద్దన్న నిర్ణయంపై ముఖ్య నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లిన వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్యలు గైరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు లేవని గమనించిన ముగ్గురు నాయకులు కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్యలు తమ రాజీనామా చేసినట్టుగా వెల్లడించారు. వరసగా రెండు సార్లు సింగరేణి గనుల్లో తిరుగులేని పట్టు నిలుపుకున్న టీబీజీకెఎస్ ఈ సారి అనూహ్య నిర్ణయం తీసుకోవడం వారికి మింగుడు పడకుండా చేసిందనే చెప్పాలి. దశాబ్దాలుగా సింగరేణి కార్మికులతో అనుభందం పెనవేసుకున్న ముగ్గురు నాయకులు టీబీజీకెఎస్ నుండి పోటీ చేసి మరోసారి పట్టు నిలుపుకోవాలని భావించినప్పటికీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వారిని నిరాశకు గురి చేసింది. దీంతో ముగ్గురు ముఖ్య నాయకులు కూడా పదవులకు రాజీనామా చేయడం సింగరేణి వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భవిష్యత్తు కార్యాచరణ..?
మరో ఆరు రోజుల్లో గుర్తింపు సంఘానికి సంబంధించిన పోలింగ్ జరగనుంది. హై కోర్టులో ఇంధన శాఖ పిటిషన్ వేసి చాలినంత యంత్రాంగం లేనందున తాము ఎన్నికలు నిర్వహించలేమని… ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. అయితే గురువారం హై కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరపాలని ఆదేశించింది. దీంతో ఎన్నికలు అనివార్యం అయిన నేపథ్యంలో టీబీజీకేఎస్ పోటీ చేయవద్దన్న తీసుకున్న నిర్ణయంతో ముఖ్య నాయకులు ముగ్గురు కూడా పదవులకు రాజీనామా చేశారు. అయితే కార్మిక వర్గాల్లో ప్రభావం చూపించే ఈ నాయకులు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందున్నదే ప్రశ్నార్థకంగా మారింది. మరో కార్మిక సంఘానికి అనుకూలంగా వీరు ప్రచారం చేస్తారా లేక వేరే కార్మిక సంఘంలో చేరి తమ పట్టు నిలుపుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా సింగరేణి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వెనక కారణాలు ఏంటన్నది మాత్రం అంతుచిక్కకుండా పోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడమే కారణమా లేక అధికారంలో ఉన్నప్పుడే కార్మిక సంఘాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడమా అన్నది మాత్రం పజిల్ గా మారింది. అయితే ఈ సారి జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మాత్రం గులాభి జెండాలు కనిపించవని మాత్రం తేలిపోయింది.