దిశ దశ, పెద్దపల్లి:
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ క్షేత్ర స్థాయిలో చుక్కలు చూపిస్తున్నట్టుగా ఉంది. ప్రచార పర్వంలో ప్రతికూలత ఎదురవుతున్న తీరు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఒకే రోజున బొగ్గు బావుల వద్ద మహిళా కార్మికుల ప్రశ్నల పరంపర… తనను మాజీ మంత్రి కొప్పుల మోసం చేశాడంటే స్ట్రాటలాజిస్ట్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రాంతాలు కూడా ఆయనను అక్కున చేర్చుకున్నవే కావడం మరో విశేషం.
సింగరేణి ప్రచారంలో…
బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి బొగ్గు బావుల వద్ద బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. ఈ క్రమంలో ఓ మహిళ కార్మికురాలు తమ కష్టాలను ఎకరవు పెట్టింది. అసలు మహిళల కష్టాలు ఎందుకు పట్టించుకోలేదు..? ఇంతకాలం అధికారంలో ఉంది ఎవరూ అంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సమక్షంలోనే నాయకులను ప్రశ్నించారు. ఎంత వర్క్ లోడ్ అవుతోంది ఎవరొచ్చి మాట్లాడుతారు… బదిలీలు చేయడం మాత్రం చాలా మంచిగా నేర్చుకున్నారు…50 మంది మహిళలను మీరు బదిలీ ఎలా చేశారు..? అన్ని తెలుసు మాకు… ఒక్కో అమ్మాయి ఎంత కష్టపడుతోంది..? మా మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది కార్మికులు కళ్లు తిరిగి పడిపోతున్నారు… మీరు ఫ్యాన్ల కింద కూర్చొని పనిచేస్తుంటే మీకేం ఏర్పడుతుంది అంటూ మహిళా కార్మికులురాలు నిలదీశారు.
వెల్గటూర్ లో…
మరో వైపున కొప్పల ఈశ్వర్ పై స్టాటలాజిస్ట్ ఒకరు ఆరోపణలకు దిగారు. జగిత్యాల జిల్లా వెల్గటూరులో ఏకంగా మీడియా ముందుకు వచ్చిన స్ట్రాటలాజిస్ట్ నిమ్మ భరత్ ఆరోపణలకు దిగారు. లోకసభ ఎన్నికల నేఫథ్యంలో తనతో సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేయించుకుని ఇప్పుడు డబ్బులు అడగగానే తనను నిందిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తానూ దళితుడినేనని తనతో పర్సనల్ గా మాట్లాడిని కొప్పుల ఈశ్వర్ స్ట్రాటజిస్ట్ గా పనిచేయడదానికి రూ. 10 లక్షలు ఇస్తానని కొప్పుల ఈశ్వర్ ఒఫ్పుకున్నాడని, మొదట రూ. 50 వేలు నగదు కూడా ఇచ్చాడని భరత్ వివరించారు. దీంతో తన టీమ్ తో కలిసి కొప్పులకు అనుకూలంగా, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి వ్యతిరేకంగా పలు వీడియోలు తయారు చేసి వైరల్ చేశానన్నారు. తీరా డబ్బులు కావాలని అడిగినందుకు తనపై నిందలు వేస్తున్నారని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే భరత్ వెల్గటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆయనను నిలువరించే ప్రయత్నం చేశారు. అగ్రిమెంట్ ఉందా అంటూ భరత్ ను అడిగారు. నువ్వు చేసిన వీడియోలు ఏంటీ..? మేము కూడా వీడియోలు షేర్ చేశామంటూ భరత్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు ఎంత ఇచ్చారంటూ భరత్ ను నిలదీశారు.
సొంత ఇలాకాలోనే…
బుధవారం చోటు చేసుకున్న రెండు పరిణామాలు కూడా కొప్పుల ఈశ్వర్ ఇలాకాలే కావడం గమనార్హం. సింగరేణి బిడ్డగా ఎదికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొప్పుల ఈశ్వర్ కొల్ బెల్ట్ ప్రాంతంలో ఎదిగిన మెయిన్ లీడర్లలో ఒకరు. అటువంటి ఈశ్వర్ ప్రచారం కోసం మైన్ ఏరియాకు వెల్లినప్పుడు మహిళా కార్మికురాలు ప్రశ్నించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈశ్వర్ కు బొగ్గుబావులపై తిరుగులేని పట్టు ఉంటుందని అంచనా వేసినప్పటికీ అనుకోని విధంగా ప్రతికూలత ఏర్పడడం సంచలనంగా మారింది. ఇకపోతే నిన్నమొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిథ్యం వహించిన ధర్మపురి నియోజకవర్గలో కూడా ఆయనపై ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. స్ట్రాటలాజిస్ట్ నిమ్మ భరత్ తనను కొప్పుల ఈశ్వర్ మోసం చేశారంటూ వెల్గటూరులో ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిగతా సెగ్మెంట్లపై ప్రధాన దృష్టిని పెట్టే పనిలో నిమగ్నమైన క్రమంలో ఆయన సొంత ప్రాంతాల్లోనే ప్రతికూల వాతావరణం ఎదురు కావడం బీఆర్ఎస్ శ్రేణులకు మింగుడు పడకుండా చేస్తోంది.